అద్దంకి రూరల్: వివిధ జిల్లాల్లో 18 నుంచి 20 దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సంతమాగులూరు మండలం వెల్లలచెరువుకు చెందిన జంగాల శాంతిస్వరూప్ బాపట్లలో 2008లో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసి పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు గ్రామంలో రిసెర్చ్ అప్రంటీస్ చేశాడు. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మార్టేరు గ్రామానికి చెందిన రెల్లు శివతో పరిచయం ఏర్పడి ఇద్దరు కలిసి దొంగతనాలు చేశారు.
ఇద్దరినీ అక్కడి పోలీసులు పట్టుకుని రాజమండి జైలుకు పంపారు. శాంతిస్వరూప్ బెయిల్‌పై బయటకొచ్చి అప్పటి నుంచి దొంగతనాలు ఒంటరిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అద్దంకి, చినకొత్తపల్లి, కురిచేడు, దర్శి, శావల్యాపురం, వినుకొండ, ఒంగోలు, మద్దిపాడు, మార్టేరు, పెరవలి, తణుకు, జన్నూరు తదితర ప్రాంతాల్లో 20 దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన డబ్బు, సొత్తుతో విలాసాలు, చెడు అలవాట్లకు ఖర్చు చేశాడు. బంగారం, వెండిని తణుకులోని బంగారు వ్యాపారులు కొఠారి జయంతిలాల్, కొఠారి సంజీవ్‌కుమార్, మార్టేరు గ్రామానికి చెందిన మద్దుల రామకృష్ణారావులకు అమ్మి జల్సాలకు వాడుకున్నాడు.
సుమారు 90 నుంచి 100 సవర్ల బంగారం చోరీ చేసి ఉంటాడు. శాంతిస్వరూప్‌ను సంతమాగులూరు ఎస్‌ఐ నాగరాజు పుట్టావారిపాలెం జంక్షన్ వద్ద బుధవారం అరెస్టు చేశారు. అద్దంకి ఎస్‌ఐ సుబ్బరాజు బంగారాన్ని కోనుగోలు చేసిన వర్తకులను గురువారం అరెస్టు చేసి తీసుకొచ్చారు. శాంతిస్వరూప్, వర్తకులను కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఇంకా దర్యాప్తు పూర్తి కానందున కోర్డుకు మెమో సమర్పించి వారం రోజుల పాటు నిందితులను పోలీస్ కస్టడీకి అనుతించాలని కోరతామని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment