ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల హవా
రాష్ర్టంలో మూడో స్థానం 76శాతం ఉత్తీర్ణత
బాలురకంటే బాలికలే టాప్
విశాఖపట్నం: ఇంటర్ ఫస్టియర్‌లోనే కాదు మంగళవారం ప్రకటించిన రెండో సంవత్సరం ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు భళా అనిపించారు. 76శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాను తృతీయ స్థానంలో నిలిపారు. కిందటేడాది కూడా ఇంతే ఉత్తీర్ణత శాతం సాధించి ద్వితీయ స్థానం సంపాదించారు. రాష్ట్ర స్థాయిలో మార్కుల సాధనలో మాత్రం జిల్లా విద్యార్థులే అగ్రగామిగా నిలిచారు. ఎస్. శ్రావ్య ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా 989 మార్కులు అయిదుగురు పొందగా 980 మార్కులకు పైగా వంద మంది విద్యార్థులు మార్కులు సాధించి విద్యాపరిమళాలు వెదజల్లారు. ఈ ఫలితాల్లో కూడా బాలిక ల హవానే కొనసాగింది. బాలురు 75శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 77శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే ఒకేషనల్ విభాగంలో జిల్లా పూర్తిగా దిగజారింది. కిందటేడాది 92శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలవగా ఈ ఏడాది 70శాతం ఉత్తీర్ణతతో 7వ స్థానానికి తగ్గిపోయింది.గొలుగొండ, జి.మాడుగుల గురుకుల కళాశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు.
76శాతం ఉత్తీర్ణత : ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ కోర్సుల నుంచి 41,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 76శాతంతో 31,174 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 21,121 మంది పరీక్షలు రాయగా 75శాతంతో 15,766 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 19,967 మంది పరీక్షలు రాయగా 77శాతంతో 15,408 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఒకేషనల్ కోర్సుల్లో 3,071 మంది పరీక్షలు రాయగా 70శాతంతో 2,153 మంది పాసయ్యారు. బాలురు 1553 మంది పరీక్షలు రాయగా 73శాతంతో 1140 మంది పాసయ్యారు. బాలికలు 1518 మంది పరీక్షలు రాయగా 67శాతంతో 1013 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉత్తీర్ణతలో చతికిలబడ్డాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 4శాతం ఉత్తీర్ణత త గ్గింది. జిల్లాలో 34 ప్రభుత్వ కళాశాల నుంచి 5,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 65.85శాతంతో 3449 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో అత్యధికంగా 98.69శాతంతో దేవరాపల్లి జూనియర్ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా అనకాపల్లి జూనియర్ కళాశాల 5శాతం, పాడేరు జూనియర్ కళాశాల 14.55శాతం, డుంబ్రిగుడ జూనియర్ కళాశాల 33.40శాతంతో వెనుకబడ్డాయి. జిల్లాలో ఎయిడెడ్ కళాశాలలు నుంచి 1621 మంది పరీక్షలు రాయగా 56.94శాతంతో 923 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాలల నుంచి 544 మంది పరీక్షలు రాయగా 84.01శాతంతో 457 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 5 మోడల్ స్కూల్స్ నుంచి 180 మంది పరీక్షలు రాయగా 79.44శాతంతో 143 మంది ఉత్తీర్ణులయ్యారు.
సివిల్ సర్వీసు చేయాలని ఉంది. అందుకే టెన్త్ నుంచి లక్ష్యంగా చదువుతున్నాను. రెండేళ్ల కష్టం ఫలితంగానే ఎంపీసీ గ్రూప్‌లో 990 మార్కులు వచ్చాయి. రోజుకు 10 నుంచి 12గంటలు ప్రిపరేయ్యేదాన్ని. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే కొద్దిగా భయం. అందుకే ఫిజిక్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాను. జేఈఈ మెయిన్స్‌లో 165 మార్కులు వచ్చాయి. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతున్నాను. కచ్చితంగా ఐఐటిలో సీటొస్తుందని నమ్మకం. కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్స్‌కు ప్రిపేరవుతాను. నా చదువు వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేను. నాన్న గోపాలకృ్షష్ణ రైల్వేలో పనిచేస్తున్నారు. అమ్మ జయమ్మ గృహిణి.
-ఎస్.శ్రావ్య, ఎంపీసీ 990 మార్కులు (శ్రీచైతన్య నారాయణకళాశాల)
అదే జోరు
Published Wed, Apr 29 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement