నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
Published Wed, Feb 12 2014 1:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు నాలుగు విడతలుగా సీనియర్ సైన్స్ విద్యార్థులకు లకు జిల్లా వ్యాప్తంగా 117 కేంద్రాల్లో జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని ఆయా కేంద్రాలకు చేరవేశారు. పరీక్షలకు 15,440 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 11474 మంది కాగా, బైపీసీ విద్యార్థులు 3966 మంది ఉన్నారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. తొలిరెండు విడతలు ప్రైవేటు కళాశాలల కేంద్రాల్లోనే ప్రాక్టికల్స్ జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీటితో పాటు ఆర్‌ఐఓ, డీఈసీ క్క్వాడ్, హైపవర్ కమిటీలను నియమించారు. గత మూడేళ్లగా ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్ ఇస్తుండటంతో పాటు నాన్‌జంబ్లింగ్ పద్ధతిలోనే పరీక్షలు జరుగుతుండటంతో శతశాతం మార్కుల సాధనే లక్ష్యంగా ఆయూ కళాశాలలు ఎగ్జామినర్లు, ఇతర పర్యవేక్షణాధికారుల జేబులు నింపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అధికారులు..
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో జిల్లా ఇంటర్మీడియెట్ యంత్రాంగం తలమునకలై ఉంది. ఆర్‌ఐవో, డీఈసీ కన్వీనర్ ఎ.అన్నమ్మ డీఈసీ కమిటీ సభ్యులు బి.యజ్ఞభూషణరావు, జి.అప్పలనాయుడు, ఆర్.భూషణరావు, హైపవర్ కమిటీ ఆర్.పుణ్యయ్య తదితరులతో సమీక్షించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆరా తీశారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు!
నేటి నుంచి ప్రారంభమమ్యే ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలను పక్కాగా నిర్వహించి జిల్లాకు పేరుతీసుకురావాలి. ఎలాంటి అక్రమాలు, వసూళ్లకు పాల్పడినా చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేపడతాం.
- ఎ.అన్నమ్మ, ఆర్‌ఐవో, డీఈసీ కన్వీనర్
Advertisement