ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
Published Thu, Feb 13 2014 1:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్ష లు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి విడతగా నిర్వహిస్తున్న 26 కేంద్రాల్లో తొలిరోజు ప్రాక్టికల్స్‌కు 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. అయితే మౌలిక సదుపాయలు లేక కొన్ని సెంటర్లలో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. కొన్ని ప్రత్యేక రూట్లలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు నిర్ణీత వేళకు రాకపోవడంతో తిప్పలు తప్పలేదు. చేసేదేమీలేక...నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరాలనే ఆతృతతో ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
బోర్డు పరిశీలకుని ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ఇంటర్ బోర్డు పరిశీలకుడు ఉపేందర్‌రెడ్డి స్థానికంగా ఉన్న కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి, సాయికృష్ణ, చైతన్య సహకార జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు చేసి.. ఏర్పాట్లతీరుపై అసహనం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు సరిగాలేకుంటే కేంద్రాలను రద్దు చేస్తామని సీఎస్‌లను హెచ్చరించారు. ఆయన వెంట డీఈసీ కమిటీ సభ్యుడు జి.అప్పలనాయుడు ఉన్నారు. డీఈసీ కన్వీనర్, ఆర్‌ఐఓ ఎ.అన్నమ్మ రణస్థలం, పైడిభీమవరం, నరసన్నపేట కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా వేసేందుకు నియమించిన రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు ఇచ్ఛాపురం, కవిటి, కోటబొమ్మాళి, టెక్కలి, పాలకొండ కేంద్రాలను తనిఖీ చేశారు.
కానరాని సదుపాయాలు
తొలివిడతగా పరీక్షలు ప్రారంభమైన 26 కేంద్రాల్లో 15 సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. శ్రీకాకుళంతోపాటు పాలకొండ, కవిటి, పలాస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్‌ల్లో నాణ్యమైన ఫర్నీచర్, వెలుతురు, సరిపడినంత ప్రాక్టికల్ పరికరాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని కేంద్రాల్లో కనీసం మంచినీటిని ఏర్పాటు చేయలేదు. తొలిరోజే ఎగ్జామినర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారనే విమర్శలు వచ్చాయి.
Advertisement
Advertisement