అంతర్జాతీయ విమానాశ్రయం.. తూచ్ | International Airport .. tuc | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ విమానాశ్రయం.. తూచ్

Published Fri, Aug 8 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

అంతర్జాతీయ విమానాశ్రయం.. తూచ్

అంతర్జాతీయ విమానాశ్రయం.. తూచ్

  •     తిరుపతి ఎయిర్‌పోర్టుకు ఇంటర్నేషనల్ హోదా మాత్రమే!
  •      విస్తరణకు అనువుగా లేదన్న అలోక్ సిన్హా కమిటీ
  •      నత్తనడకన విమానాశ్రయ విస్తరణ పనులు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని ఐఐఏ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధి బృందం తేల్చిచెప్పింది. కేవలం అంతర్జాతీయ హోదా కల్పిస్తామని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే..
     
    రోజూ తిరుమలకు వేలాదిమంది భక్తులు వస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ నాణ్యమైన సోనా బియ్యం.. మామిడి, చీనీ, దానిమ్మ, కూరగాయల ఉత్పత్తి జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి రొయ్యలు, చేపలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఉన్న చిత్తూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా సాగుతోంది. దీన్ని పసిగట్టిన కేంద్రం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తామని అక్టోబర్ 8, 2008న అప్పటి కేంద్ర విమానయానశాఖ మంత్రి ప్రపుల్‌కుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా కల్పించే పనులకు శంకుస్థాపన చేశారు.

    రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఆ హామీకి స్థానం కల్పించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే విషయంపై మరోసారి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా నేతృత్వంలోని ఐఐఏ ప్రతినిధి బృందం మంగళవారం తిరుపతి విమానాశ్రయాన్ని సందర్శించింది.
     
    చేతులెత్తేసిన ఐఐఏ..
     
    అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే రన్‌వే కనీసం 12,500 అడుగుల మేర ఉండాలి. కనీసం ఏడాదికి పది మిలియన్‌ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు(టెర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, కామన్ చెక్ పాయింట్లు, సెల్ఫ్ చెక్ పాయింట్లు, ఇమ్మిగ్రేషన్ సెంటర్లు, ఫోర్ లెవల్ బ్యాగేజ్ సిష్టం, ఏఫ్రాన్) కల్పించాలి.

    ఇందుకు కనీసం మూడు వేల ఎకరాల భూమి అవసరమని ఐఐఏ ప్రతినిధి బృందం తేల్చింది. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం 140 ఎకరాల్లో ఉంది. 7,500 అడుగుల మేర రన్ వే ఉంది. రోజుకు కేవలం 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే విమానాశ్రయంలో ఉన్నాయి. రన్‌వే విస్తరణకు తూర్పున వికృతమాల ఎస్సీ కాలనీ.. పశ్చిమాన మర్రిగుంట గ్రామం, మర్రికుంట, యాదయ్యకుంట, శేషయ్యకుంట, కొత్తపాళెం చెరువులు, వందలాది వాగులు, వంకలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో రన్‌వేను 12,500 అడుగుల నుంచి తొమ్మిది వేలకు కుదించినా.. ఆ మేరకు భూమి లభ్యత కాదు. అవసరమైన మేరకు భూమి లభించకపోవడం వల్ల తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయలేమని అలోక్ సిన్హా కమిటీ మంగళవారం తేల్చింది. తిరుపతి విమానాశ్రయానికి అంత్జాతీయ హోదా మాత్రమే కల్పించవచ్చునని స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకు నివేదిక ఇచ్చింది.
     
    నత్తనకడన హోదా పనులు..
     
    తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు 702 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. ఆ మేరకు విమానాశ్రయం చుట్టుపక్కలా భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 290 ఎకరాలు ప్రభుత్వ భూమి. తక్కిన 412 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది. నష్టపరిహారం చెల్లింపుపై భూ నిర్వాసితులు పేచీ పెట్టడంతో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. రూ.100 కోట్లతో టెర్మినల్, రూ.80 కోట్లతో రన్‌వే నిర్మించాలని ఐఐఏ అంచనా వేసింది.

    భూసేకరణ పూర్థిస్థాయిలో జరగకపోయినా జూలై 22, 2011న అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు టెండర్లు పిలిచింది. రూ.96 కోట్లకు పనులను దక్కించుకున్న కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. కానీ.. ఇసుకనేల కావడంతో పనులు గిట్టుబాటు కావని కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ఆదిలోనే చేతులెత్తేసింది. అవే పనులను త్రీటీ అనే సంస్థ చేపట్టింది. గిట్టుబాటు కావడం లేదని త్రీటీ సంస్థ కూడా చేతులెత్తేసింది.

    ఇసుకనేల కావడం వల్ల విమానాశ్రయం నిర్మాణానికి 30 అడుగుల బదులు 60 అడుగుల పునాది వేయాల్సి వస్తోందని.. పనులు గిట్టుబాటు కావడం లేదని ఆ సంస్థ స్పష్టీకరించింది. దాంతో.. ఆ టెండరును రద్దు చేసిన ఐఐఏ మరోసారి టెండర్లు పిలిచింది. రూ.124.19 కోట్లతో ఐఐఏ ఇంజనీరింగ్ విభాగం, శ్యామ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టాయి. ఆ పనులు కూడా నత్తనడకన సాగుతుండటంపై ఐఐఏ ప్రతినిృధిబందం అసంతృప్తి వ్యక్తం చేసింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement