అనకాపల్లి : నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లి దూరమైంది. సంతల్లో వ్యాపారం చేసుకునే తండ్రి వ్యాపార పరంగా పని ఒత్తిడిలో ఉండడంతో పొరుగింటి వారి ప్రేమానురాగాలు ఆ బాలుడుపై పడ్డాయి. ఎన్నో కష్టాలను చూసిన ఆ బాలుడికి సేవాతత్పరత కలిగిన కుటుంబం చదువులపరంగా అండగా నిలిచింది. దీంతో చదువులో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఉన్నతోద్యోగిగా విధి నిర్వహణలో భాగంగా దేశంలో పలు కీలకమైన కేసుల్లో పనిచేస్తున్నారు. అతనే అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చియ్యనాయుడు.
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన దేశంలో మాదకద్రవ్యాల ప్రభా వం యువతపై ఎక్కువగా ఉన్నందున పది సూచనలు ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదించి మంచి గుర్తింపు పొందారు. పశ్చిమబెంగాల్‌లో మాదకద్రవ్యాల విక్రయాలు చేస్తున్న 12 మంది నైజీరియన్లను పట్టుకునే కేసులోనూ, ఢిల్లీలో నలుగురు అమ్మాయిలను వేధించిన కేసును దర్యాప్తు చేసి గుర్తింపు పొం దారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఉన్న అచ్చియ్యనాయుడు అనకాపల్లి వచ్చిన సందర్భంగా స్థానిక మీడియాను కలిసి తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన విషయాలను ఆయన మాటల్లోనే...
వైద్యుడిని కాబోయి...
నా తల్లి నాలుగేళ్ల వయస్సులో చనిపోయింది. తండ్రి సంతల్లో వ్యాపారం చేసుకునేవారు. పొరిగింటి బుద్ద జగ్గ అప్పారావుతోపాటు అతని కుమారులు శశిధర్, చక్రవర్తి నిరంతరం ఇచ్చిన స్ఫూర్తి, సూచనలు చదువుల్లో ఆర్థిక సహాయం నన్ను ఉన్నత స్థాయికి తీసుకొచ్చాయి. వారి రుణం తీర్చుకోలేనిది. కలాం, సచిన్‌లే నాకు స్ఫూర్తి. మొదట్లో వైద్యవృత్తిలోకి రావాలనే ఉద్దేశంతో శ్రమించా ను. పట్టణంలోని రాయల్‌కాన్వెంట్‌లో ఎలిమెంటరీ, జేఎల్ స్కూల్లో పదో తరగతి వరకు, విశాఖ నారాయణలో ఇంటర్మీడియట్ చదివి ఎంబీబీఎస్ రాయగా మంచి సీటు రాకపోవడంతో హిమశేఖర్ సీఎంబీబీ కోర్స్ చదివాను.
కోచింగ్ లేకుండానే పోస్టు సాధించా...
హైదరాబాద్‌లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నప్పుడు ఎంఏ ఎకనమిక్స్‌కు చెందిన మేఘనాథరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో 2015లో గ్రూప్–ఎ రాయగా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌గా ఉద్యోగం వచ్చింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ టైఅప్‌తో యూ పీఎస్సీలో పోస్టులు పడగా నాలుగున్నర లక్షల మంది పోటీపడ్డారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎంపికైన నలుగురిలో నేను ఒకడిని. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నన్ను ఎంపీసీ చదవమని పట్టుబడితే నేను మాత్రం బైపీసీ చదివాను. ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివాక జర్మనీలో ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోయా. తర్వాత ఎటువంటి శిక్షణ లేకుండా గ్రూప్ –ఎలో ఉద్యోగం సాధించా. అనంతరం యూపీఎస్సీ ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏసీపీ కేడర్ పోస్టు వచ్చింది.
సిలబస్‌పై అవగాహన పెంచుకొని చదవాలి: సివిల్సే కాకుండా ఏ పోటీ పరీక్షకైనా, ఇటువంటి కష్టతరమైన ఎంట్రన్స్‌లకు పోటీ పడినప్పుడు దానిలో ఉన్న సిలబస్‌ను ఆకలింప చేసుకొని చదవాలి. దీనికి తోడు సరైన మార్గనిర్దేశం కూడా అవసరం. అప్పుడే విజయవం సొంతం చేసుకోగలం.
Comments
Please login to add a commentAdd a comment