బేస్తవారిపేట, న్యూస్‌లైన్: కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన సామాజిక వనాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు-మోక్షగుండం గ్రామాల మధ్య హైవే పక్కన సర్వే నంబర్ 1లో 290 ఎకరాల కొండ పోరంబోకు స్థలం ఉంది. డీపీఏపీ పథకంలో బంజరు భూములను అభివృద్ధి చేసి మొక్కలు పెంచారు. వన సంరక్షణ బాధ్యతలు డీపీఏపీ, ఫారెస్టు అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పట్టించుకోలేదు. కొండపోరంబోకు స్థలాల ఆక్రమణలు అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఆక్రమించి పొలాలుగా మార్చుకుంటున్నారు. రెండు, మూడేళ్లలో దాదాపు 40 ఎకరాలు పరులపాలైంది. కొందరు రెవెన్యూ అధికారులకు భారీగా మామూళ్లు ముట్టజెప్పి పట్టాలు తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కొనసాగుతున్న ఆక్రమణలు
సామాజికవన కొండ పోరంబోకు స్థలంలో మోక్షగుండానికి చెందిన కొందరికి పట్టాలు ఇవ్వడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు రంగం సిద్ధం చేశారనే సమాచారం అందుకున్న స్థానికులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. రాత్రి వేళల్లో హిటాచ్ యంత్రాలతో గతంలో నాటిన కుంకుడు, గంగరేగు, వేప చెట్లను పీకేసి ట్రాక్టర్లతో మరో 30 ఎకరాలను పొలాలుగా మార్చుకుంటున్నారు. ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు పరులపాలవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములు ఆక్రమించుకుంటున్నారు : వెంకటరెడ్డి, గ్రామస్తుడు
ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేసిన సామాజిక వన సంరక్షణ భూమి ఆక్రమణకు గురవుతోంది. అసైన్‌మెంట్ కమిటీలో పట్టాలు ఇవ్వనున్నట్లు తెలియడంతో కొందరు యంత్రాలతో దున్నేసి పొలాలుగా మార్చుకుంటున్నారు.
పశువుల మేతకు ఇబ్బంది : ఏ ఈశ్వరరెడ్డి, గ్రామస్తుడు
రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారు. గ్రామంలో దాదాపు రెండు వేల పశువులున్నాయి. కొండ పోరంబోకు భూమి అన్యాక్రాంతమైతే పశువులను అమ్ముకోవాల్సిందే.
ఆక్రమణదారులపై చర్యలు: పి.సావిత్రీదేవి, తహసీల్దార్
మోక్షగుండం సర్వే నంబర్- 1 కొండ పోరంబోకు భూమి. ప్రస్తుతం కొండ పోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి. ఆక్రమణదారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.
అక్రమార్కులకు ‘వన’ భోజనం
Published Fri, Nov 22 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement