చెరువులు, కుంటలే కాదు.. శ్మశానాలనూ వదలట్లేదు. అధికారపార్టీ అండకు తోడు అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్న ఫలితంగా కోరుట్లలో భూబకాసురుల అగడాలకు అంతులేకుండాపోయింది. జిల్లాలో కరీంనగర్ మినహాయిస్తే.. ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్న పట్టణంగా గుర్తింపు పొందిన కోరుట్లలో వాటికి రక్షణ కరువైంది.
ఈమధ్యకాలంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని కాపాడేందుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంటుండగా.. కోరుట్లలో మాత్రం ఈ దిశగా ముందడుగు వేసిన దాఖలాలులేవు. కేవలం ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో సరిపెట్టుకున్న రెవెన్యూ అధికారులు కబ్జాలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. అధికారయంత్రాంగం మేలుకోకుంటే రానున్నకాలంలో ప్రజావసరాలకోసం గుంటస్థలమూ దొరకని దుస్థితి ఏర్పడనుంది.
కోరుట్ల, న్యూస్‌లైన్ : రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో కోరుట్లలో మొత్తం 157 సర్వే నంబర్లలో ప్రభుత్వ స్థలాల్లో 1,450 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కలు రికార్డులకే పరిమితం కాగా.. ఇప్పటికే ఈ స్థలాల్లో చాలామేర కబ్జాలపాలయ్యాయి. పట్టణంలోని కల్లూర్‌రోడ్ వెంట 1553 సర్వే నంబరులో ఉన్న సుమారు 20 ఎకరాల భూమి బొల్లికుంటకట్ట స్థలం కబ్జాలకు గురైంది.
నక్కలగుట్ట పరిసరాల్లో 476, 478 సర్వే నంబర్లలో సుమారు 30 ఎకరాల స్థలం ఉండగా కాలనీకి కేటాయించిన ఐదెకరాలు మినహాయిస్తే మిగిలిన స్థలం కబ్జాదారుల పాలయింది. ఈ కబ్జాల్లో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ల పాత్ర ఉందని ఆరోపణలున్నాయి.
తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే తోవలో 1497 సర్వే నంబరులోని మద్దులచెరువు శిఖం భూమిలో అధికారపార్టీకి చెందిన ఓ రియల్టర్ ఏకంగా పది ఎకరాలు కబ్జా చేశాడు. ఇందులో పలు నిర్మాణాలకు సంబంధించి పునాదులు కూడా నిర్మిస్తున్నారు.
గతంలో 1300, 1304, 1309 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమి రికార్డుల్లో నుంచి మాయమైంది. ఈ రికార్డులు మాయం కావడం వెనక స్థానిక రియల్టర్లు, రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు సమాచారం. కొందరు బడావ్యాపారులు గతంలో పనిచేసిన అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ భూములను అసైన్ చేయించుకున్నారు. ఇలా 150 ఎకరాలకు పైగా భూములు అసైన్‌మెంట్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈమధ్యకాలంలో మేలుకున్న రెవెన్యూ అధికారులు వీరికి నోటీసులు ఇస్తున్నా.. నేతల ఒత్తిళ్లతో ప్రయోజనం దక్కడం లేదు. కొత్తగా ఏర్పాటైన అర్బన్, మాదాపూర్ కాలనీల సమీపంలోనూ మిగిలిన ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారుల నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
శ్మశానాలను వదలట్లేదు..
కోరుట్ల పట్టణం దినదినాభివృద్ధి చెం దుతున్న క్రమంలో శివారుల్లో భూము ల ధరలకు రెక్కల వచ్చాయి. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం కోరుట్ల మద్దులచెరువు పక్కన ఓ రియల్టర్ శ్మశానస్థలం ఆక్రమించిన ఉదంతం కలకలం రేపిం ది. ఆ సమయంలో సదరు శ్మశానానికి చెందిన సామాజికవర్గం వారు తీవ్ర ఆందోళన చేసి తమ స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించుకున్నారు. ఈ సం ఘటనను తలపిస్తూ.. నెలరోజుల క్రి తం వాగుశివారులో ఉన్న మోచీ సం ఘం శ్మశానస్థలం ఆక్రమణకు గురైంది.
సదరు సంఘంవారు అధికారులతో మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుం డా పోయింది. పదిహేనురోజుల క్రితం ఆర్టీసీ అధికారులు తమ స్థలం కబ్జాకు గురైందంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పరిధిలో కోరుట్ల-మెట్‌పల్లి రోడ్‌వెంట ఉన్న ఓ స్థలాన్ని దాతలే అక్రమించేందుకు చేసి న ప్రయత్నం ఇటీవల వివాదస్పదమయింది. ఖాళీ స్థలం కనిపిస్తేచాలు.. ఎలా కబ్జా చేయాలా అన్న రీతిలో కొం దరు వ్యవహరిస్తుండడంతో పట్టణంలో భూవివాదాలు రగులుతున్నాయి. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ అధికారుల క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్వాధీనం చేసుకుంటాం
- నక్క శ్రీనివాస్, తహశీల్దార్
ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతు న్న విషయం ఇటీవల మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే అసైన్డ్ భూములను అక్రమంగా పొందిన వారికి నోటీసులు జారీ చేశాం. కబ్జాకు గురైన రెవెన్యూ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటాం.
భూమాయ
Published Sun, Sep 22 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement