
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట
రాష్ట్రంలోని నీటి వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు.
- రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
- వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నీటి వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్లించడానికి వీలుగా నిర్మించతలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వారం రోజుల్లోగా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వచ్చే నాలుగైదేళ్లలో పూర్తి చేసేందుకు, వాటి పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయనున్నారు.
రాష్ట్రంలోని నదులన్నింటిలో 5,742 టీఎంసీల నీరు ఉంది. దానిలో 4,148 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. అందులో వచ్చే ఐదేళ్లలో 975 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2,500 టీఎంసీల నీరు లభ్యతలోకి వస్తే 2.50 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనా వేసింది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించింది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు, హంద్రీనీవా నుంచి 40 టీఎంసీల నీటిని చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు తీసుకెళ్లడానికి అవసరమైన పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు.
మున్సిపాలిటీల కేటగిరీల కుదింపు
రాష్ట్రంలో ఆరు కేటగిరీలుగా ఉన్న మున్సిపాలిటీలను మూడు కేటగిరీలుగా కుదించామని, కమిషనర్లకు అధికారాలను పెంచామని మంత్రి తెలిపారు. ప్రతి కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారిని, మున్సిపాలిటీలకు గ్రూప్-1 అధికారిని కమిషనర్‌గా నియమించాలని తీర్మానించామని, మున్సిపాలిటీల్లో బ్యూటిఫికేషన్, గ్రీనరీ, ల్యాండ్ స్కే పింగ్ కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించామని వెల్లడించారు.
కేబినెట్ ఇతర ముఖ్యమైన నిర్ణయాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో 256 ఇసుక రీచ్‌లు ఉండగా వాటిని ఈ నెలాఖరులోగా 300కు పెంచాలని తీర్మానించారు.
మంగంపేట బెరైటీస్ గనుల్లో ఉన్న ఐదు కోట్ల మెట్రిక్ టన్నుల ఖనిజం అమ్మకాలకు ఈ-వేలం ద్వా రా గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
కృష్ణపట్నంలో పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తికి చర్యలు. విద్యుత్తు కొరత నివారణకు, 24 గంటలూ ఇచ్చేందుకు నిర్ణయం.
భూ కేటాయింపులివే..
నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో 423.46 ఎకరాల భూముల్ని పవన విద్యుత్తు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, రైల్వే బ్రాడ్ గేజ్ లైన్‌కు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. కడప జిల్లాలో ఓబులవారిపల్లె నుంచి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు వరకు న్యూ బ్రాడ్ గేజ్ లైన్‌కు మార్కెట్ విలువ ఎకరా రూ. 6 లక్షల వంతున 11.14 ఎకరాలను లీజు కు సౌత్ సెంట్రల్ రైల్వేకు కేటాయించారు. మరో 26.47 ఎకరాల్ని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజరు పేరిట ఎకరా రూ. 3 లక్షల వంతున ఇచ్చారు. బ్రాడ్ గేజ్ లైన్‌కు వెంకటాచలం మండలం కసుమూరులో ఎకరా రూ. 7.93 లక్షల చొప్పున 95.82 ఎకరాలు కేటాయించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఏర్పాటుకు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో 5.28 ఎకరాలు కేటాయించారు. పొదలకూరు మండలం మారుపూర్‌లో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఎకరా రూ. 6 లక్షల వంతున 72.13 ఎకరాలిచ్చారు. అనంతపురం జిల్లాలోని సీకే పల్లి, తాడిపత్రి మండలాల్లో 45.60 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తికి 25 సంవత్సరాల లీజు విధానంలో నెడ్‌క్యాప్, ప్రైవేటు కంపెనీకి 290 ఎకరాలు కేటాయించారు.