సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుక అక్రమ రవాణా గుట్టుగా సాగిపోతోంది. నియంత్రించాల్సిన అధికారులు కొందరు అక్రమ వ్యాపారంలో భాగస్వాములు కావటంతో తమ్ముళ్ల ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరు కాయల్లా వెలిగిపోతోంది. మహిళల పేరుతో కొందరు అధికార పార్టీ నేతలు రూ.కోట్లు సంపాదించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు శివారు ప్రాంతంలోని పొట్టేపాళెం రీచ్‌లో పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరలింపులో ఓ మాజీమంత్రి, ఆయన సతీమణి పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. పొట్టేపాళెం రీచ్ ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ రీచ్‌పై వారి పెత్తనం ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు.
అందులో భాగంగానే ఇటీవల జరగాల్సిన పట్టణ సమాఖ్య ఎన్నికలను సైతం వాయి దా వేయించారనే ప్రచారం జరుగుతోంది. వారి కారణంగా సభ్యుల మధ్య గొడవలు చెలరేగుతున్నాయి. ఈ దందాలో అధికారులు పాత్ర ప్రముఖంగా ఉందని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇకపోతే సూళ్లూరుపేట పరిధిలో సర్వముఖి నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఇద్దరు ప్రముఖ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. చేతికి మట్టి అంటకుండా ఇద్దరు నేతలు అధికారులు చేత అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారనే ప్రచారం ఉంది. స్వర్ణముఖి నదిలో నుంచి ఇసుకను ఎవరు తీసుకెళ్లినా ముడుపులు చెల్లించాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు.
ముడుపులు ఇవ్వకుండా వెళ్లిపోతే అక్కడి నిర్వాహకులను ఇష్టమొచ్చినట్లు తిట్టడంతో పాటు... వారిపై లేనిపోని కేసులో.. ఆరోపణలు చేసి అక్కడి నుంచి తప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కోవూరు పరిధిలో జమ్మిపాళెం, సుబ్బారెడ్డిపురం రీచ్‌ల నుంచి టీడీపీకి చెందిన మండల నాయకులు జేసీబీలతో తవ్వి ఇసుకను అమ్ముకుంటున్నారు. బుచ్చిరెడ్డిపాళెం పరిధిలో జొన్నవాడ ఇసుక రీచ్ నుంచి స్థానిక టీడీపీ నేతలు అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కోట మండలపరిధిలో పుత్తులపల్లి రీచ్ నుంచి బీజేపీ, టీడీపీ నేతలు కుమ్మక్కై ఇసుక తరలించి సొమ్ముచేసుకుంటున్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసి ఉన్నారు.
సంగం మండలపరిధిలోని అన్నసాగరం ఇసుక రీచ్ నుంచి ఓ టీడీపీ నాయకుడి కనుసన్నల్లో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంద ని ఫిర్యాదులున్నాయి. జిల్లాలో మరి కొన్నిచోట్ల అనుమతి లేకపోయినా... స్థానిక అధికారపార్టీ నాయకులు ఇసుకను జేసీబీలతో తవ్వి తమిళనాడుకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. బిల్లులను మాయ చేసి ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ... కోట్లల్లో జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పేరు మహిళలది.. వ్యాపారం అధికార పార్టీ నాయకులదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఫలితం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇసుకాసురులు!
Published Thu, Mar 26 2015 2:13 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement