ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
అనంతపురం అర్బన్ : మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డ్వామా సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టి, పెట్టుబడి నిధి నిర్వహణ, వడ్డిలేని రుణాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. మంత్రి పల్లె మాట్లాడుతూ డ్వాకా రుణమాఫీలో భాగంగా ప్రతి మహిళా సభ్యురాలి ఖాతాలో మూడు విడతలుగా రూ.10 వేలు జమ చేస్తామని తెలిపారు.
జిల్లాలోని 51,532 డ్వాక్రా గ్రూపుల పరిధిలో 5,53,715 మంది సభ్యులు ఉన్నారని, వీరికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 544.32 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 2014 నుంచి 2015 మే నెల వరకు తీసుకున్న డ్వాక్రా రుణాలపై ఉన్న రూ. 155.02 కోట్ల వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నవ నిర్మాణ మౌనదీక్ష, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పేదరిక నిర్మూలన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీటిని విజయవంతం చేయాలని కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, డీఎఫ్‌ఓ రాఘవయ్య, డ్వామా పీడీ నాగభూషణం పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం
Published Wed, May 20 2015 2:55 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement