సాక్షి, విజయవాడ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రేవంత్, అతని అనుచరుల ఇళ్లపై దాడి చేసిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు తాజాగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్లను టార్గెట్ చేసినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానూరులోని నారాయణ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ దాడుల వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ విద్యాసంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని తెలిపారు. గతంలోనే ఆదాయపుపన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు నారాయణ సంస్థలకు నోటీసులిచ్చారు. ట్రస్ట్ ద్వారా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నట్లు నారాయణ యాజమాన్యం వివరణ కూడా ఇచ్చింది. (చదవండి: టీడీపీ నేత ‘బీద’ సంస్థలపై ఐటీ దాడులు)
అలాగే సదరన్ డెవలపర్స్, వీఎస్ లాజిస్టిక్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వీఎస్ లాజిస్టిక్స్ గుంటూరులో రైల్వేకోచ్‌ల మరమ్మతులు, రైల్వే నిర్మాణ పనులకు సబంధించిన కాంట్రాక్టులు చేస్తోంది. విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరులో ఈ రెండు సంస్థల కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టు పనులను సదరన్ డెవలపర్స్ నిర్వహించినట్లు సమాచారం. విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ఐటీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి మొత్తం పది బృందాలుగా అధికారులు తనిఖీలకు వెళ్లారు.
విశాఖపట్నం సీతమ్మధారలోని ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, గురుద్వారా జంక్షన్‌లో ఉన్న శుభగృహ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టారు. భూముల క్రయ విక్రయాలకు, రిజిస్ట్రేషన్ చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉండటంతో పాటు, జిఎస్టీను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఫిర్యాదులు అందటంతో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పోలీస్ బందోబస్తు మధ్య రికార్డులు, డాక్యుమెంట్ లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆ సొమ్ము ఏపీదే!
రేవంత్ రెడ్డి ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ నగదును ఏపీ నేతలే అందించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ అవినీతి సొమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మంత్రి ద్వారానే డబ్బును తెలంగాణకు పంపినట్లు ప్రచారం కూడా జరిగింది. అంతేకాకుండా కర్ణాటక, తాజాగా తెలంగాణ ఎన్నికలకు కూడా ఏపీ నుంచే వందల కోట్లు పంపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఐటీ అధికారులు గత రాత్రి పోలీసుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి 10 బృందాలుగా ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.
నెల్లూరులో బీద మస్తాన్‌రావు ఆస్తులపై జరిగిన దాడుల నేపథ్యంలో టీడీపీ నేతలు హడలిపోతున్నారు. రాజధానిలో వందలాది ఎకరాలను కొనగోలు చేసిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కాగా, బీద మస్తాన్‌రావు నివాసాలు, కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన సోదరుడైన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment