ఆయ్‌కర్ భవన్‌లోని ఐటీ కార్యాలయానికి వస్తున్న సెబాస్టియన్, ఆయ్‌కర్ భవన్ నుంచి బయటకు వస్తున్న ఉదయసింహా, విచారణకు హాజరయ్యేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లో భాగంగా పలువురికి నోటీసులిచ్చిన అధికారులు విచారణను వేగవంతం చేశారు. రేవంత్‌రెడ్డి మామ పద్మనాభరెడ్డితోపాటు ఓటుకు కోట్లు కేసులో నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహా సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆయ్‌కర్ భవన్‌లో ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ప్రధానంగా ఓటుకు కోట్లు కేసులో రూ.50 లక్షల వ్యవహారంపైనే ప్రశ్నించినట్టు తెలిసింది. ఇన్నాళ్లు తెరమీదకు రాని పద్మనాభరెడ్డినీ ఐటీ అధికారులు ప్రశ్నించడం సర్వత్రా చర్చకు దారితీసింది.
ఉదయ్‌సింహాతో మొదలుపెట్టి...
ఐటీ కార్యాలయానికి ఉదయం 10.30 సమయంలో వచ్చిన ఉదయ్‌సింహాని దాదాపు 2 గంటలపాటు ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడివి? ఎవరి నుంచి తీసుకువచ్చారు? ఐటీ రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయంలోనే రూ.50 లక్షలున్నాయా? అన్న కోణంలో విచారించినట్టు తెలిసింది. అన్ని వివరాలపై మళ్లీ బుధవారం వస్తానని ఉదయ్‌సింహా చెప్పడంతో అత డిని పంపించివేశారు. ఐటీ అధికారులమంటూ కొందరు చైతన్యపురికి చెందిన తన బంధువు డాక్టర్ రణధీర్‌రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లారని ఉదయ్‌సింహా ఆరోపించారు. బంగారం, నగదు, సెల్‌ఫోన్లు సైతం తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పగా తాము సోదాలు చేయలేదని, తమకు సంబంధంలేదని చెప్పారని ఉదయ్‌సింహా మీడియా కు తెలిపారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అతడిని తీసుకెళ్లినట్టు ఐటీ ఇన్‌స్పెక్టర్ చెప్పారన్నారు. రణధీర్‌రెడ్డితో తనకు ఏ లావాదేవీలు లేవని, కుట్రపూరితంగా ఆయన్ను కిడ్నాప్ చేశారని ఆరోపించా రు. అయితే, ఈ వ్యవహారంపై రణధీర్‌రెడ్డి కుటుంబీకులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఐదు గంటలపాటు కొండల్‌రెడ్డి...
రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐటీ రిటర్నుల్లో చూపించిన పలు ఆదాయ వ్యవహారాలపై ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. ఓటుకు కోట్లు కేసులో రూ.50 లక్షలు కొండల్‌రెడ్డి ఏమైనా అందించాడా అన్న కోణంలో విచారించినట్టు తెలిసింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొండల్‌రెడ్డి విచారణ ముగించుకొని వెళ్లిపోయారు.
ఓటుకు కోట్లులోనే విచారణ: సెబాస్టియన్
ఓటుకు కోట్లు కేసులోనే తనపై ఐటీ దాడులు జరిగాయని, సీబీఐ, ఈడీ సూచన మేరకే సోదాలు చేస్తున్నారని సెబాస్టియన్ ఆరోపించారు. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఐటీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్ మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తెచ్చిన రూ.50 లక్షలపై విచారణ కొనసాగుతోందన్నారు. మిగిలిన రూ.4.50 కోట్ల రూపాయల్ని ఎక్కడి నుంచి సమకూర్చాలనుకున్నారు? ఆ డబ్బుతో తనకున్న సంబంధాలేంటన్న దానిపై ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఆ డబ్బుతో తనకెలాంటి సంబంధంలేదని చెప్పానని, దీనిపైనే పదే పదే ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తనను కావాలనే కేసుల పేరుతో రాజకీయాలకు వాడుకొంటున్నాయన్నారు. 4 గంటలు సెబాస్టియన్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు రాత్రి 8 గంటలకు పంపించివేశారు. మళ్లీ పిలిస్తే వచ్చేందుకు అందుబాటులో ఉండాలని చెప్పినట్టు సెబాస్టియన్ తెలిపారు.
పెళ్లికి ముందునుంచే ఐటీ కడుతోంది
ఓటుకు కోట్లు కేసులో డబ్బు గురించే తనను ప్రశ్నిం చారంటూ రేవంత్‌రెడ్డి మామ పద్మనాభరెడ్డి ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరైన సందర్భంగా వెల్లడించారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధంలేదని అన్నారు. తన ఇంట్లో గతంలోనే ఐటీ సోదాలు జరిగాయని, అధికారులిచ్చిన నోటీసుల మేరకే తాను కార్యాలయానికి వచ్చానని తెలిపారు. రేవంత్‌రెడ్డితో వివాహం కాకముందు నుంచే తన కూతురు గీత, తాను ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతమున్న నివాసం తన కూతురిదే నని చెప్పారు. రేవంత్‌రెడ్డి మామగా కాకుండా తనకు వ్యక్తిగతంగా చాలా గుర్తింపు ఉందని, తాను 35 ఏళ్లుగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నానని చెప్పా రు. తనకు సంబంధించిన వ్యాపారాలు, ఆదాయ మార్గాలపై అధికారులకు వివరించానని వెల్లడించారు.
ఉప్పల్ పోలీసుల అదుపులో రణధీర్‌రెడ్డి
ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహ సన్నిహితుడు, కిడ్నాప్‌నకు గురయ్యాడని భావిస్తున్న రణధీర్‌రెడ్డిని ఉప్పల్ పోలీసులు సోమవారంరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు రణధీర్ అనుమానాస్పదస్థితిలో ఓ బ్యాగుతో కన్పించాడు. ఆపి తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో కొంత నగదు, బంగారం, డాక్యుమెంట్లతోపాటుకంప్యూటర్‌హార్డ్‌డిస్క్, అనుమానాస్పద లాకర్ ‘కీ’లు కన్పించాయి. వీటికి సంబంధించి ఆయన్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఠాణాకు తరలించారు. అవన్నీ ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో విచారిస్తున్నారు. లెక్కలు చెప్పని నగదు, బంగారంతోపాటు అనుమానాస్పద వస్తువులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై రణదీర్‌పై కేసు నమోదు చేశారు. ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ తమకు సంబంధించిన వాటినే బ్యాగులో పెట్టి రణదీర్‌కు అప్పగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వస్తువులతోపాటు నిందితుడిని మంగళవారం ఐటీ అధికారులకు అప్పగించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment