సర్క్యులర్ జారీ చేసిన సీఎస్ ఐ.వై.ఆర్.
హైదరాబాద్: ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల జిల్లా, క్షేత్రస్థాయిలో అధికారుల సమయమంతా వీడియో కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనేందుకే సరిపోతోందని, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. ప్రతీ శాఖకు చెందిన కార్యదర్శులు లేదా శాఖాధిపతులు జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల జిల్లాల్లో, క్షేత్రస్థాయి పనిచేయాల్సిన అధికారులకు సమయం దొరకడం లేదని ఇటీవల నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం సర్క్యులర్ జారీ చేశారు.
సర్క్యులర్లో ఏముందంటే..
- క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు ఇబ్బంది కలగకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు ఉండాలి.
- జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలి.
- శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు తప్పనిసరిగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాల్సి ఉంటే ప్రతీ నెల మొదటి శనివారం మూడో శనివారం మాత్రమే నిర్వహించాలి.
- ప్రతీ శాఖ వీడియో కాన్ఫరెన్స్ రెండు గంటలకు మించి నిర్వహించరాదు.
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబంధించిన మినిట్స్‌ను ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీఎం కార్యాలయంలో సంబంధిత అధికారికి పంపించాలి.
- ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కార్యదర్శి గానీ శాఖాధిపతి గానీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంటే ముందుగా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలి.