జాక్‌పాట్ మాఫియా | Jackpot Mafia | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్ మాఫియా

Published Tue, Sep 9 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

Jackpot Mafia

సాక్షి, నెల్లూరు: చెన్నైకి అక్రమంగా బియ్యం తరలిస్తూ కొందరు రూ.కోట్లు గడిస్తున్నారు. జాక్‌పాట్ మాఫియా పేరుతో అక్రమార్కులు ఏకంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు వ్యాపారులకు జాక్‌పాట్ మాఫియా భరోసా ఇస్తూ బియ్యం అక్రమ తరలింపును తమ భుజస్కంధాలపై వేసుకుంది. దీనిని అడ్డుకోవాలనుకునే అధికారుల ముఖాన నోట్లకట్టలు కొట్టి నోరుమూయిస్తోంది. కాదూకూడదని ఏ అధికారన్నా మాట్లాడితే  మాఫియా పవర్ చూపించి వారిని బదిలీ చేయిస్తోంది. దీంతో అందిన కాడికి నెలమామూళ్లు దండుకుని అధికారులు తమకేమీపట్టనట్టు మిన్నకుండిపోతున్నారు. పేదలకందాల్సిన ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని సైతం వ్యాపారులు చెన్నెకి ఎగుమతి చేస్తున్నారు.
 
అక్రమాల పుణ్యమాని ఏటా ప్రభుత్వం రూ.వందకోట్లు నష్టపోతోంది. ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల లేవీ సేకరణలో భాగంగా  జిల్లాలో వరిధాన్యం సేకరిస్తోంది. ధాన్యం సేకరణ బాధ్యతను జిల్లాలోని 260కి పైగా ఉన్న  రైస్ మిల్లులకు అప్పగించింది. దీంతో మిల్లర్లు ఏటా 20 లక్షల టన్నులకు తగ్గకుండా ధాన్యాన్ని సేకరిస్తారు. లెవీకింద ప్రభుత్వం అడిగిన 3 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకున్న ప్రభుత్వం  ఇందుకు ప్రతిఫలంగా   మిగిలిన 25 శాతం ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు ఎగుమతుల కోసం  అధికారికంగా పర్మిట్లు జారీ చేయడం పరిపాటి. అయితే అధికారులు  25 శాతం ఎగుమతులకు కూడా పర్మిట్లు ఇవ్వకుండా 10 నుంచి 15 శాతం ధాన్యానికే పర్మిట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు మిల్లర్ల వద్ద పెద్ద ఎత్తున ముడుపులు దండుతున్నట్టు ఆరోపణలున్నాయి. పర్మిట్ల ప్రకారం   5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నందున వాటిని పక్కన పెట్టి అక్రమంగా బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నారు. చెన్నైలో బియ్యం దిగుమతులకు ట్యాక్స్ లేకపోవడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది.
 
జాక్‌పాట్ మాఫియా పుట్టుక
బియ్యాన్ని అక్రమంగా చెన్నైకి తరలిస్తున్న జిల్లాకు చెందిన ఓ లారీ  ఓనర్ బియ్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చెన్నైకి బియ్యాన్ని తరలించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అందుకు చెన్నై సాధారణ బాడుగకు రెట్టింపు మొత్తాన్ని ఇవ్వాలని షరతు పెట్టాడు. అధికారులతో సమస్య లేకుండా ఉంటే చాలనుకున్న వ్యాపారులు ఓకే చెప్పారు. ఆ వ్యక్తి అధికారులకు లంచాలు ఎరచూపి అక్రమబియ్యం రాష్ట్ర సరిహద్దు తడ చెక్ పోస్ట్ దాటించడం  షురూ చేశాడు. తమిళనాడులో ట్యాక్స్ లేకపోవడంతో  బియ్యం లారీలు తడ దాటితే చాలు. అలా మొదలైన జాక్‌పాట్  ట్రాన్స్‌పోర్ట్ వందల లారీల సరఫరాకు ఎదిగింది.
 
రోజుకు 150-200 లారీల బియ్యం అక్రమ తరలింపు
రైతుల నుంచి సేకరించిన ధాన్యం బియ్యమే కాక జిల్లాలో 1873 చౌకదుకాణాల పరిధిలో నెలకు 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు అందించాల్సి ఉంది. ఇందులో 60 శాతం బియ్యాన్ని  పేదలకు అందకుండానే నెల్లూరు జాక్‌పాట్  మాఫియా  ఆయా రేషన్ షాపుల డీలర్ల నుంచి సేకరించి  ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. లబ్ధిదారులకు కిలో బియ్యానికి రూ.9 చెల్లించి వాటిని డీలర్ కొనుగోలు చేస్తాడు. అనంతరం  డీలర్ అదే బియ్యాన్ని రూ.12తో జాక్‌ఫాట్ మాఫియాకు విక్రయిస్తున్నట్టు సమాచారం.
 
మిగిలిన 10 శాతం బియ్యం స్థానికంగా హోటళ్లకు తరలిపోతోంది. ఇక పేదలకు చేరుతున్న బియ్యం అక్షరాలా 30 శాతమే. ోజూ 150 నుంచి 200 బియ్యం లారీలను అక్రమంగా తరలిస్తూ జాక్‌పాట్ ట్రాన్స్‌పోర్ట్ మాఫియాగా వర్ధిల్లుతోంది. ఈ మొత్తం బియ్యం ప్రతిరోజూ నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేట,రాజుపాలెం, నవలాకుల గార్డెన్స్ కేంద్రంగా లోడ్ చేసి  రాత్రి 10 గంటల ప్రాం తంలో చెన్నైకి బయల్దేరుతాయి. లారీలకు ముందూవెనకా జాక్‌పాట్ మాఫియా తడ చెక్ పోస్ట్ దాటేవరకూ ఎస్కార్ట్‌గా వెళుతుంది. ఇక్కడ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం బియ్యం కొనుగోలు చేసి చెన్నైకి అక్రమంగా తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.
 
అధికారుల అండ
వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డీటీ, తహశీల్దార్ మొదలు జిల్లాస్థాయిలో డీఎస్‌ఓ, జేసీ, విజిలెన్స్ అధికారులు సబ్సిడీ బియ్యం పంపిణీని పర్యవేక్షిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది అధికారులు జాక్‌పాట్ మాఫియాతో చేతులు కలిపి చౌక బియ్యం ఎగుమతికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు జిల్లాస్థాయి అధికారులకు నెలకు రూ.లక్షల్లోనే ముడుతున్నట్లు కలెక్టరేట్ పరిధిలో పనిచేసే ఓ ఉన్నతాధికారే పేర్కొనడం విశేషం. ఇక చెక్‌పోస్టు అధికారుల సహకారం అంతాఇంతా కాదు. వారు దాదాపు జాక్‌పాట్ మాఫియాలో  భాగస్వాములయ్యారు.
 
పర్మిట్లు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రతిరోజూ జాక్‌పాట్ లారీలను చెన్నై, కేరళ, కర్నాటకలకు సురక్షితంగా తరలించడమే వృత్తిగా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే మొక్కుబడి తనిఖీలు నిర్వహిస్తూ నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. చెక్‌పోస్టు సిబ్బంది సహకారం లేకపోతే మాఫియా ఆగడాలు కొనసాగలేవు. ఈ మాఫియా పుణ్యమాని నెల్లూరు జిల్లాలో చౌకబియ్యం పేదలకు అందడంలేదు. ఇదేమని ప్రశ్నించిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇచ్చింది తీసుకొని నోరుమూసుకెళ్లమని డీలర్లే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో  చేసేదేమీలేక లబ్ధిదారులు మిన్నకుండి పోతున్నారు. మరీ గట్టిగా మాట్లాడితే రేషన్ కార్డే లేకుండా చేస్తామని అధికార పార్టీకి చెందిన డీలర్లు బెదిరిస్తున్నారు. నెల్లూరులో జాక్‌పాట్ మాఫియా కార్యకలాపాలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎస్‌ఓలకు తెలియందికాదు. ఎందుకు మౌనం వహిస్తున్నారో వారికే తెలియాలి. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదివారం రాత్రి కొద్దిసేపు తనిఖీలు నిర్వహిస్తే 45 లారీల బియ్యం పట్టుబడింది. ఈ లెక్కన  అక్రమ రవాణా ఏస్థాయిలో ఉందో అర్థమౌతుంది.
 
ఒక్కోపోలీసు స్టేషన్‌కు నెలకు రూ.50 వేలు
తడ చెక్‌పోస్ట్ దాటేవరకూ నెల్లూరురూరల్ పోలీసు స్టేషన్, వెంకటాచలం, మనుబోలు, చిల్లకూరు,సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, గూడూరు రూరల్ తదితర పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో పోలీసు స్టేషన్‌కు జాక్‌పాట్ మాఫియా నెలకు రూ.50 వేలకు తగ్గకుండా మామూళ్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు పోలీసు అధికారులకు సైతం పెద్ద ఎత్తున ముడుతున్నట్లు సమాచారం. ఒక్క విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికే ఏడాదికి రూ.2 కోట్లు  ముడుపులు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది. వాణిజ్యపన్నుల విభాగంతో పాటు ఆర్‌టీఓ అధికారులకూ ముడుపులు భారీగా అందుతున్నట్టు తెలుస్తోంది. కొందరు రెవెన్యూ ఉన్నతాధికారులు పెద్దమొత్తంలో దండుకుంటున్నట్టు సమాచారం. పౌరసరఫరాల విభాగం వారికి లక్షల్లో నెల మామూళ్లు ముడుతున్నాయి.
 
అధికారం సపోర్ట్:
బియ్యం అక్రమ తరలింపునకు పాల్పడుతున్న జాక్‌పాట్ మాఫియాలో జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు నగరానికి చెందిన కొందరు నేతలే కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో అధికారం వెలగబెట్టిన నేతల అండతోనే ఈ మాఫి యా నడిచింది. ఇప్పడు అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల అనుచరులు జాక్‌పాట్ మాఫియాలో కీలక భూమిక పోషిస్తూ అక్రమాలకు తెరలేపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement