సన్నగా.. తరలిపోగా! | rice mafia | Sakshi
Sakshi News home page

సన్నగా.. తరలిపోగా!

Published Thu, Aug 11 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

తంగెడంచ గ్రామంలోని ఓ గుడిసెలో నిల్వ చేసిన రేషన్‌ బియ్యం

తంగెడంచ గ్రామంలోని ఓ గుడిసెలో నిల్వ చేసిన రేషన్‌ బియ్యం

జిల్లాలో బియ్యం మాఫియా
– కర్ణాటకకు తరలిపోతున్న రేషన్‌ బియ్యం
– డీలర్ల నుంచి సేకరిస్తున్న ఏజెంట్లు
– నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు కేంద్రంగా వ్యవహారం
– తాజాగా విజిలెన్స్‌ దాడుల్లో తేటతెల్లం
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. రేషన్‌ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డీలర్లతో పాటు కార్డుదారుల నుంచీ రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని మిల్లుల్లో ఆడించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఒక బ్రాండ్‌ పేరున్న సంచుల్లో నింపి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి ఈ విధంగా రేషన్‌ బియ్యం కాస్తా సన్న బియ్యం రూపంలో తరలిపోతోంది. విజిలెన్స్‌ విచారణలో ఈ విషయాలన్నీ తాజాగా బయటపడ్డాయి. నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు కేంద్రంగా ఈ బియ్యం మాఫియా చెలరేగిపోతుందని సమాచారం.        
 
ఏజెంట్ల ద్వారా సేకరణ
రేషన్‌ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి తరలించేందుకు మాఫియా భారీగానే యాక్షన్‌ ప్లాన్‌ చేసి వ్యవహారం నడుపుతోంది. ప్రధానంగా ఈ బియ్యం మాఫియా బియ్యం సేకరించేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. కిలో బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10లతో కొనుగోలు చేస్తున్నారు. రూపాయికే వచ్చిన బియ్యానికి అధిక ధర వస్తుండటంతో అటు డీలర్లు, ఇటు దొడ్డుబియ్యం తినని కార్డుదారులు ఈ ఏజెంట్లను ఆశ్రయించి బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని కాస్తా ఏజెంట్లు.. బియ్యం మాఫియాకు రూ.14లకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత మాఫియా కాస్తా దొడ్డు బియ్యాన్ని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి బ్రాండ్‌ రూపంలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయాలన్నీ తాజాగా నందికొట్కూరు కేంద్రంగా నడుస్తున్న బియ్యం మాఫియాపై విజిలెన్స్‌ దాడుల సందర్భంగా తేటతెల్లమయినట్లు తెలిసింది.
 
రూపాయి.. ముపై ్ప రూపాయలవుతోంది
వాస్తవానికి రేషన్‌షాపుల్లో కార్డుదారులకు కిలో బియ్యం రూపాయికే లభ్యమవుతోంది. ఈ బియ్యాన్ని డీలర్లతో పాటు రేషన్‌ బియ్యం తినని కార్డుదారుల వద్ద నుంచి మాఫియా సేకరిస్తోంది. ఇక్కడి నుంచి కర్ణాటకకు తరలిపోతున్న ఈ బియ్యం ధర కాస్తా అక్కడ కిలో రూ.30 పలుకుతోంది. అంటే కిలో రూపాయి బియ్యం కాస్తా రూ.30 అవుతోందన్నమాట. నందికొట్కూరు కేంద్రంగా ఖాదర్‌ బాషా నడుపుతున్న ఈ బియ్యం మాఫియా వ్యవహారం తాజాగా విజిలెన్స్‌ దాడుల్లో బయటపడింది. ఇలాంటి బియ్యం మాఫియా జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్నట్టు సమాచారం. ఈ మాఫియాకు అటు అధికారుల అండదండలతో పాటు అధికారపార్టీ నేతల ఆశీస్సులు ఉండటంతో వ్యవహారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతున్నట్లు చర్చ జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement