రేషన్ బియ్యం పట్టివేత
విజయవాడ (భవానీపురం) :
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. కోదాడ నుంచి కాకినాడకు 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయపాల్ నేతృత్వంలో సిబ్బంది భవానీపురం బైపాస్ రోడ్‌లో కాపు కాశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బియ్యం లోడుతో వస్తున్న లారీని అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 230 గన్నీ బ్యాగ్స్, 112 తెల్ల సంచుల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ లోడులో పైవరుసలో సాధారణ బియ్యం బస్తాలను పేర్చి అడుగున రేషన్ బియ్యం బస్తాలను ఉంచారు. లారీలోని రేషన్ బియ్యాన్ని గొల్లపూyì మార్కెట్ యార్డ్‌లోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో దించి, ఇన్‌చార్జి నరసింహారావుకు అప్పగించారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం లారీని, డ్రైవర్ నాగరాజును భవానీపురం పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు ఎన్‌ఎస్‌ఎస్ అపర్ణ, ఎస్‌కే నభి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ వైవీవీ సత్యనారాయణ, ఆర్‌ఐ ఎ.లత పాల్గొన్నారు.