పేదల బియ్యం.. పెద్దల భోజ్యం | Illegal Ration rice business | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం.. పెద్దల భోజ్యం

Published Mon, Sep 12 2016 5:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

పేదల బియ్యం.. పెద్దల భోజ్యం

పేదల బియ్యం.. పెద్దల భోజ్యం

* సరిహద్దులు దాటించేస్తున్న అక్రమార్కులు
నరసరావుపేట, సత్తెనపల్లి కేంద్రంగా దందా
* ముఖ్య నేత తనయుడి ఆధ్వర్యంలోనే నిర్వహణ!
 
అక్రమార్కులు పేదల బియ్యాన్నీ వదలడం లేదు. వారి కడుపుకొట్టి.. తమ జేబులు నింపుకొంటున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సేకరించిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు.
 
నరసరావుపేట: పేదల బియ్యానికి భద్రత కొరవడింది. సరిహద్దులు దాటి మరీ విదేశాలకు తరలిపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలు కేంద్రంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత తనయుడు పట్టణ ప్రజాప్రతినిధి ఒకరిని ఏజెంటుగా పెట్టుకొని బియ్యం మాఫియా నడుపుతున్నాడు. రేషన్‌ డీలర్లకు సరకు చేరగానే వారి నుంచి బియ్యాన్ని సేకరించి గోతాలు మార్చేస్తున్నారు. వరల్డ్‌ రైస్‌ పేరుతో కాకినాడ పోర్టుకు వాటిని తరలిస్తున్నారనే ఆరోరపణలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
పలుమార్లు పట్టుబడినా.. 
గతేడాది సెప్టెంబర్‌ 10వ తేదీ రాత్రి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలోని ఎస్‌ఆర్‌కేటీ జంక్షన్‌ వద్ద పాడుబడిన గోడౌన్‌లో తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రేషన్‌ బియ్యం డంపును పట్టుకున్నారు. అందులో సుమారు రూ.30 లక్షల విలువైన రేషన్‌ బియ్యం బస్తాలను అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో రేషన్‌ బియ్యం బస్తాలు ఒకేచోట పట్టుబడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ డంపులో వరల్డ్‌ రైస్‌ పేరుతో ఉన్న రేషన్‌ బియ్యం బస్తాలను గమనించిన అధికారులే విస్తుపోయారు. టీడీపీ నాయకులు, రేషన్‌ డీలర్ల ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరుగుతుండటంతో అధికారులు కూడా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో బియ్యం సేకరణ కేంద్రాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లుకు మార్చారు. అక్కడ కొంతకాలంగా నిర్వహించిన అనంతరం ఇప్పుడు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం కేంద్రంగా బియ్యం సేకరణ నిర్వహిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి పెట్లూరివారిపాలెంలో పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 44 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవటం గమనార్హం.  జిల్లాలో బియ్యం మాఫియా కార్యకలాపాలు విస్తరిస్తుండటం ప్రమాదకర సంకేతాలనిస్తోంది. పిడుగురాళ్లలోనూ ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 
 
రకరకాలుగా బియ్యం సేకరణ..
జిల్లాలోని 57 మండలాల్లో 2731 రేషన్‌ షాపులు ఉండగా, వాటిలో అత్యధిక శాతం టీడీపీ కార్యకర్తల చేతిలోనే ఉన్నాయి. జిల్లాలో 13.39 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా, వాటిలో రూ.10.26 లక్షల కార్డుదారులకు ప్రతినెలా 13,600 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. లబ్ధిదారులకు వాటిలో సగం కూడా సక్రమంగా పంపిణీ కావటం లేదు. నరసరావుపేట, సత్తెనపల్లిలో టీడీపీ అధికారంలోకి రాగానే డీలర్లు నూతనంగా నియమించినవారు కావటంతో బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారు. సహకరించకపోతే డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని, కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. రేషన్‌ బియ్యం ఒక రూపాయికే కేజీ చొప్పున ఇళ్లకు తీసుకెళ్లినవారి నుంచి కేజీకి రూ.8 చొప్పున చెల్లించి మధ్య దళారులు సేకరిస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సర్వర్‌ పనిచేయటం లేదనే సాకుతో డీలర్లు లబ్ధిదారులకు స్లిప్‌లు ఇచ్చి బియ్యం ఇవ్వకుండా పదేపదే షాపుల చుట్టూ తిప్పుకొంటున్నారు. చివరికి కేజీకి రూ.7 చొప్పున రేషన్‌ కార్డుదారుల చేతిలో డబ్బు పెట్టి పంపిస్తున్నారు. ఈ విధంగా మిగిలిన బియ్యాన్ని డీలర్లు కేజీ రూ.12కు అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. వాటిని బియ్యం మాఫియా కేజీ రూ.25 చొప్పున ఎగుమతి చేస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. 
 
నిజాలు నిగ్గుతేలుతాయి : నల్లపాటి 
బియ్యం మాఫియాపై లోకాయుక్త నిర్వహించే దర్యాప్తుతోనైనా నిజాలు నిగ్గుతేలుతాయనే నమ్మకం తనకు ఉందని ఎన్‌సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్‌ తెలిపారు. బియ్యం మాఫియాపై ఆయన లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాఫియాను అరికట్టాలని, పేదల బియ్యానికి భద్రత కల్పించాలని, లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement