
జగన్‌కు ఘన వీడ్కోలు
రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం జిల్లా ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు వేదికగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను ఏడవ రోజు మంగళవారం తెల్లవారు జామున పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయనను వైద్యులు బుధవారం సాయంత్రం డిశ్చార్జి చేయడంతో బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చి వీడ్కోలు పలికారు. -సాక్షి, గుంటూరు
గుంటూరు : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరురోజులపాటు చేసిన నిరవధిక నిరాహార దీక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఉత్తేజాన్ని కలిగించింది. ఆ స్ఫూర్తితో రాజధాని శంకుస్థాపనకు జిల్లాకు రానున్న దేశప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను అమలులోకి తీసుకువచ్చేందుకు గ్రామస్థాయి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. విషమించిన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షను ఉపసంహరించుకోవాలని వైద్యులు, పార్టీ సీనియర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా మారని జగన్ వైఖరి మేధావి, విద్యార్థి లోకాన్ని ఆలోచింప చేస్తే, మహిళాలోకాన్ని కదిలించి వేసింది. పార్టీతో సంబంధం లేని కొన్ని వర్గాలు సడలని జగన్ దీక్షా, దక్షతలను కొనియాడాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, ఆశయాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జగన్ చేపట్టిన ఈ దీక్షకు సంఘీభావం పలికాయి. ఈ పరిణామాలన్నీ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్‌కు పరామర్శల వెల్లువ ...
ఈ నెల 7వ తేదీన గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు 13 వ తేదీ తెల్లవారుజామున భగ్నం చేశారు. విషమించిన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్‌కు బలవంతంగా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో స్థానిక ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రిలోనూ జగన్‌ను పరామర్శించేందుకు పార్టీ సీనియర్ నేతలతోపాటు మేథావి వర్గానికి చెందిన లావు రత్తయ్య వంటి ప్రముఖులు తరలివచ్చారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ వెళ్లారు.
అమలులోకి కార్యాచరణ ..
పార్టీ ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను నేతలు అమలులోకి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు తలపెట్టిన ‘నిరసన మార్చ్’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్యంలో విజయవాడ తరలివెళ్లిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను అక్కడి పోలీసులు అరెస్టుచేశారు. నిరసన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు ఈ చర్య తీసుకోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, ముఖ్య మంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీలే అవసరమని భావిస్తూ ఈ పోరాటాలను అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుంటూ రు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విజయవాడలో నిరసన మార్చ్ నుంచి సాక్షి ప్రతినిధికి ఫోన్‌లో వివరించారు.
రిలే నిరాహార దీక్షలపై సమావేశాలు ...
ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న నిరసన కార్యక్రమాల ఏర్పాట్లపై నాయకులు బుధవారం కొన్ని చోట్ల సమావేశం అయ్యారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయవాడలోని నిరసన మార్చ్‌కు హాజరుకావడంతో ఆయన సోదరుడు పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని పక్కాగా అమలు పరిచి రాజధాని శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక హోదా పట్ల ప్రజల ఆకాంక్షను వివరించేందుకు సమాయత్తం అవుతున్నారు.