సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం అమలు కోసం ఐక్యంగా ఉద్యమించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు మొదటి నుంచీ ప్రత్యేక హోదాపై ఒకే విధమైన అభిప్రాయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ నెల 6 నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు పూనుకోవడం హర్షణీయమన్నారు. అదే రోజు జాతీయ రహదారులపై పాదయాత్ర పేరుతో మరో ఉద్యమాన్ని చేపట్టడం వల్ల సత్ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. ఒకేరోజు వేర్వేరు పార్టీలు వివిధ రకాల పోరాటాలకు పిలుపునిస్తే సత్ఫలితాలు రావని పేర్కొన్నారు.
25 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తేవాలని, ఉద్యమానికి ఢిల్లీని కేంద్ర బిందువుగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం కృషి చేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానించి ఐక్య పోరాటానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment