సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు కేంద్రం దిగి రాకపోతే వైఎస్సార్‌సీపీ ఎంపీలందరూ మూకుమ్మడిగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తామని.. అనంతరం ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్పారు. ఢిల్లీలో ఆ పార్టీ లోక్‌సభ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ఇక్కడి కానిస్టిట్యూషన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
మేకపాటి మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మా ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు కేంద్రం దిగి రాకపోతే వైఎస్సార్‌సీపీ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తారని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మా పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం.
అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే పేరుతో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్ల వద్ద ఫొటోలకు పోజులు ఇచ్చి వెళ్లారు. ఎన్నికల సమయంలో 10 ఏళ్లపాటు హోదా ఇస్తామన్న బీజేపీ.. కాదు 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారు..’ అని వివరించారు.
టీడీపీ, బీజేపీ నిందారోపణలు: వైవీ
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. హోదాను విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ఎలా అడుగుతారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ఊపిరి.. ఆ ఊపిరిని సాధించుకొనేందుకు మా ఊపిరినైనా వదిలేస్తాం..’ అని చెప్పారు.
మోసం చేశారు: వరప్రసాదరావు
‘తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసగించాయి. ప్రత్యేక హోదా వస్తుందని ఆకాంక్షించి ప్రజలు వారిని గెలిపించారు. నాలుగేళ్లు కాపురం చేశారు. కానీ, ఒక్క సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అడగలేదు.
పార్లమెంటు సమావేశాల్లో రోజుకు ఏడెనిమిది గంటలపాటు మా కాళ్లపై నిలబడి హోదా కోరుతూ నిరసన తెలిపాం. అయినా ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందులో భాగంగానే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది. దీంతో టీడీపీ కూడా మమ్మల్ని అనుసరించాల్సి వచ్చింది’ అని వెలగపల్లి ప్రసాదరావు వివరించారు.
దర్యాప్తు జరపాలి: మిథున్‌రెడ్డి
‘అవినీతిలో కూరుకుపోవడం వల్ల చంద్ర బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారు. అనేక ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదిక చెబుతోంది. మరి బీజేపీ ఎందుకు చర్య తీసుకోలేదు? అసలు బీజేపీకి, టీడీపీకి మధ్య తేడాలు ఎందుకు వచ్చాయో ప్రజలు తెలుసుకోవాల నుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రావాలి. రాజీనామా చేసి దీక్షకు కూర్చోవాలి..’ అని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రానిదే బాధ్యత: అవినాష్‌రెడ్డి
‘ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇచ్చాం. కేంద్రం ప్రభుత్వం దానిని చర్చకు, ఓటింగ్‌కు తీసుకురాకుండా తప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తోందో చూస్తున్నాం.
ఇందుకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రధాని పార్లమెంటుకు వచ్చినా లోక్‌సభకు రారు. రేపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి వస్తుందో రాదో తెలియదు. శుక్రవారం సభ నిరవధిక వాయిదా పడిన తరువాత రాజీనామా చేసి ఆమరణ దీక్ష ప్రారంభిస్తాం.’.. అని అవినాష్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment