
‘ఆ 13 జిల్లాల్లోనే జగన్‌కు 140 సీట్లు ఖాయం’
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చాలా ధైర్యవంతుడని, కష్టాలకు ఎదురొడ్డి నిలిచాడని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర జిల్లాల్లో జగన్ హవా కొనసాగుతుందని ఆయన తెలిపారు. జగన్ బెయిల్ మంజూరు అయిన అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీమాంధ్ర జిల్లాల్లో జగన్మోహనరెడ్డి తిరుగులేని నాయకుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ 13 జిల్లాల్లోనే జగన్‌కు 140 సీట్లు రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో విస్ర్తతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ఐటీ రంగానికి హైదరాబాద్ నగరమే అనుకూలమైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల పెట్టేందుకు హైదరాబాద్ అనుకూలమైనదని ఆయన తెలిపారు.ఈ నెల 29వ తేదీన జరిగే సకల జనుల భేరీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.