టౌన్ కొత్తరోడ్డు నుంచి టర్నర్ చౌల్ట్రీ వరకు జరిగిన రథయాత్రతో కిక్కిరిసిన రోడ్డు
ఆలయంలో ఉండాల్సిన దేవదేవుడు.. భక్తుల కోసం వారి మధ్యకే వచ్చాడు. బలభద్ర, సుభద్రలతో కలిసి జగన్నాథుడు వేలాది భక్తుల పూజలు అందుకుంటూ రథంలో ఊరేగుతూ గుండిచా మందిరానికి చేరుకున్నాడు. పదిరోజులపాటు దశావతారాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నాడు. నగరంలోని టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం, సిరిపురంలోని ఉత్కళ్ సాంస్కృతి సమాజ్, ఉక్కునగరంలో ఉత్కళ్ సమాజ్ ఆధ్వర్యంలో రథయాత్రను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు రథయాత్రలో వేలసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి.
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): లోక రక్షకుడు జనావాసాల చెంతకొచ్చాడు. లక్ష్మీనాథుడు తనను అర్చించే భక్తుల సన్నిధికే తరలివచ్చాడు. సోదరీసోదరులతో కలిసి రథమెక్కి నగర వీధుల్లో కదిలివెళ్లాడు. ప్రధానాలయం నుంచి బయల్దేరి పదిరోజుల కొలువుకు గుండిచా మఠానికి చేరుకున్నాడు. గురువారం సాయంత్రం కిక్కిరిసిన మెయిన్ రోడ్డులో ఊరేగిన జగన్నాథుడు భక్తులకు దివ్యానుభూతిని కలిగించాడు. నగరంలో జగన్నాథస్వామి రథయాత్ర గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.
మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, తప్పెట గుళ్లు, సేవా గరిడీలు, కోలాటాలు, భజనల నడుమ జగన్నాథ రథచక్రాలు కదిలాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా స్వామి రథం లాగేందుకు పోటీపడ్డారు. టౌన్ కొత్తరోడ్డులో వెలసిన జగన్నాథ స్వామి తొలి రథయాత్ర ఏవీఎన్ కాలేజ్ డౌన్‌రోడ్డు, పూర్ణామార్కెట్ మీదుగా గుండిచా మఠంగా వెలసిన టర్నర్ చౌల్ట్రీ వరకు పయనించాయి.
రథమెక్కిన దేవదేవుడు
గురువారం సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విద్యుత్ దీపాలలో అలంకరించిన రథంపైకి తీసుకు వెళ్లడంతో యాత్రలో ప్రధాన ఘట్టం పూర్తయింది. అనంతరం రథం పయనం మొదలైంది. స్వామి రథం లాగేందుకు అందరూ పోటీపడ్డారు. టౌన్ కొత్తరోడ్డు నుంచి సాయంత్రం 4.55 గంటలకు ప్రారంభమైన తొలి రథయాత్ర ఏవీఎన్ కాలేజ్‌డౌన్ రోడ్డు, పూర్ణా మార్కెట్, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా నేత్రపర్వమైన కార్యక్రమాల నడుమ సాగింది.
అసంఖ్యాకంగా భక్తులు రథాన్ని చుట్టుముట్టి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ కోలాహలం నడుమ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రథం టర్నర్ చౌల్ట్రీకి చేరుకుంది. అనంతరం స్వామిని టర్నర్‌చౌల్ట్రీలోని కల్యాణమండపంలోకి ఆహ్వానించారు. అక్కడ రోజుకో దివ్యావతారంతో జగన్నాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
రథం లాగిన మంత్రి అవంతి
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ రథాన్ని లాగి యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులు రథాన్ని లాగుతూ జగన్నాథుడిని స్మరించుకున్నారు. ఆలయ అర్చకులు పాణంగిపల్లి జగన్నాథాచార్యులు, పాణంగిపల్లి రంగనాధాచార్యులు, పాణంగిపల్లి కేశవాచార్యులు, యేడిద సురేష్‌బాబు నేతృత్వంలో రథంపై వేంచేసిన స్వామిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ పర్యవేక్షణలో ఆంజనేయస్వామి ఆలయ ఈవో అల్లు జగన్నాథరావు ఏర్పాట్లు పరిశీలించారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో..
జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాగర్‌నగర్ ఇస్కాన్ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్, మాతాజి నితాయి సేవిని సారథ్యంలో జగన్నాథస్వామి రథయాత్ర కనులపండువగా సాగింది. సాయంత్రం 4 గంటలకు.. నాలుగు రథాలతో రథయాత్ర నిర్వహించారు. రథయాత్రను మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తదితరులు ప్రారంభించారు. పాత జైల్‌రోడ్డులోని ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రథయాత్ర ప్రారంభమై డాబాగార్డెన్స్, ప్రకాశరావుపేట జంక్షన్, జగదాంబ జంక్షన్, వైఎస్సార్ విగ్రహ కూడలి, వాల్తేర్ మెయిన్‌రోడ్డు, సర్క్యూట్ హౌస్ మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వద్ద ముగిసింది.
అనంతరం గురజాడ కళాక్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామిని అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి ఔన్నత్యంపై సాంబ దాస్, జగన్నాథుని లీలలపై మాతాజి నితాయి సేవిని ప్రవచించారు. కూచిపూడి ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. భకులు తయారు చేసిన 108 రకాల ప్రసాదాలను స్వామికి నివేదన చేశారు. ఆధ్యాత్మికవేత్త ఎం.వి.రాజశేఖర్, డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, శ్రీవంశీ పాపారావు, కంకటాల మల్లిక్, మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పటల్ ఎమ్‌డీ మురళీకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.
ఉప్పొంగిన ఆనందం
ఉక్కునగరం: జగన్నాథుని రథయాత్ర ఉక్కునగరంలో వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మొదట స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్, శారద దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథంపైకి తరలించారు. సీఎండీ రథ్ బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేశారు. భక్తులు రథాన్ని ఉక్కునగరంలోని పలు సెక్టర్లలో ఉరేగించారు. డైరెక్టర్‌లు కె.సి.దాస్, రాయ్‌చౌదరి, వి.వి.వేణుగోపాలరావు, ఉత్కళ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment