ఫైల్ ఫోటో
సాక్షి, విశాఖపట్నం: గుంటూరులో విద్యార్థిని రమ్య హత్యను పనిలేని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. లోకేష్ బరువుతో పాటు విచక్షణ కోల్పోయారని ఎద్దేవా చేశారు. గ్రామస్థాయి నాయకులు కంటే లోకేష్ భాష అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు లోకేష్ దిగడం సరికాదన్నారు. పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన లోకేష్ ఏదో విజయం సాధించినట్టు ప్రవర్తించడం అతని అవివేకమని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని ధ్వజమెత్తారు.
విద్యార్థిని రమ్య హత్య బాధాకరమని, అపదలో ఉన్న యువతులు దిశ యాప్ వినియోగించుకోవాలని మంత్రి అవంతి సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో యువతులు, మహిళల హక్కులు భంగం కలిగిస్తే సీఎం వైఎస్ జగన్ ఉపేక్షించరని గుర్తుచేశారు. పోలీసులు సకాలంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారని తెలిపారు. సీఎం జగన్ రమ్య తల్లిదండ్రులకు బాసటగా నిలిచే క్రమంలో ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment