కోరుట్ల, న్యూస్‌లైన్ : జగిత్యాల ఏఎస్పీ రమారాజేశ్వరికి ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి రావడంతో ఆ స్థానం దక్కించుకునేందుకు గతంలో సబ్‌డివిజన్‌లో పనిచేసి పదోన్నతి పొందిన వారు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్నెల్లలో సాధారణ ఎన్నికలు జరగనున్న క్రమంలో డీఎస్పీ పోస్టును కీలకంగా భావిస్తున్న ఈ ప్రాంత నాయకులు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉండేవారికి పోస్టింగ్ ఇప్పించేందుకు ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త అధికారి నియామకంలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.
పాతకాపుల ఆశలు!
డీఎస్పీ పోస్టింగ్ దక్కించుకునేందుకు ఇదే సబ్ డివిజన్‌లో సీఐలుగా పనిచేసిన ముగ్గురు తీవ్రంగా యత్నిస్తున్నట్లు పోలీసువర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో కోరుట్లలో సీఐగా పనిచేసి పదోన్నతి పొంది ప్రస్తుతం లూప్‌లైన్‌లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారితోపాటు, మెట్‌పల్లిలో సీఐగా పనిచేసి పదోన్నతి పొందిన మరో అధికారి, మెట్‌పల్లి, జగిత్యాలల్లో సీఐగా పనిచేసిన ఇంకో అధికారి తీవ్రంగా యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వారంలో కొత్త డీఎస్పీ పోస్టింగ్ ఇవ్వనున్న క్రమంలో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ఎవరి రూటు వారిదే!
జగిత్యాల డీఎస్పీ పోస్టింగ్ కోసం యత్నిస్తున్న పోలీసు అధికారులు ఎవరి రూటులో వారు ముందుకెళుతున్నారు. వీరి లో ఇద్దరు జగిత్యాల డివిజన్‌లోని అధికార పార్టీకి చెందిన మాజీమంత్రులను ఆశ్రయిస్తున్నారు.
మరొకరు జిల్లా మంత్రితో గతంలో ఉన్న సంబంధాలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న క్రమం లో తమకు అనుకూలురైన పోలీసు అధికారి డివిజన్ బాస్ గా ఉంటే ఉపయోగం ఉంటుందన్న యోచనతో నాయకు లు తమ పంతం నెగ్గించుకోవాలన్న ఆరాటంతో ఉన్నారు. ముమ్మర యత్నాల్లో ఉన్న అధికారుల్లో ఎవరికి పోస్టింగ్ దక్కుతుందనే విషయంలో పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు నేతలు తమను ఆశ్రయించిన అధికారికే పోస్టింగ్ దక్కాలన్న పట్టుదలతో ఉన్న క్రమంలో ఎవరికి పోస్టింగ్ ఇస్తే ఎవరితో తంటాలు వస్తాయోనన్న ఉద్దేశంతో పదోన్నతి పొందిన వారి కంటే ఐపీఎస్ లేదా గ్రూపు వన్ అధికారులను జగిత్యాల డీఎస్పీగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జగిత్యాల డీఎస్పీ పోస్టు ఎవరికి దక్కేనో?
Published Fri, Nov 1 2013 4:16 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement