సాక్షి, న్యూఢిల్లీ: అటల్ భూజల్ యోజన కింద ఎంపిక చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం రాజ్యసభలో రాతపూర్వకంగా జవాబిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాల నిర్వహణ కోసం రూ.6,000 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించిన ఈ పథకం గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఆ జిల్లాల్లో 11.50 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) కాకినాడ–విజయవాడ–నెల్లూరు గ్యాస్ పైప్‌లైన్ పనులను ఐఎంసీ లిమిటెడ్‌కు అప్పగించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు ఆయన సోమవారం సమాధానం ఇచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లో కనీసంగా 11.50 లక్షల పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు.
ఏపీకి రూ.387 కోట్లు విడుదల చేశాం
అక్టోబర్–నవంబర్ 2019 కాలానికి ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్టీ పరిహారం కింద రూ. 682 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.387 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు.
జిల్లా సహకార బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు 11.85 శాతం
జిల్లా సహకార బ్యాంకుల్లో 2019 మార్చి చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తులుగా మారినవి మొత్తం రుణాల్లో 11.85 శాతంగా ఉన్నాయని, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, బెల్లాన చంద్రశేఖర్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
డిమాండ్‌కు సరిపడా ఐరన్ ఓర్ ఉంది
దేశంలో స్టీలు పరిశ్రమ అవసరాలకు సరిపడా ఐరన్ ఓర్ ఉత్పత్తి అవుతోందని, అయితే మరో ముడి సరుకు అయిన కోకింగ్ కోల్ నిల్వలు తగినంత లేనందున దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఏపీ దిశ చట్టం త్వరగా ఆమోదం పొందేలా చూడాలి
ఏపీ దిశ చట్టం–2019 త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగ గీతావిశ్వనాథ్ కేంద్రాన్ని కోరారు. సోమవారం ఆమె జీరోఅవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ఇటీవల మహిళలపై అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చినట్టు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, సుశిక్షితులైన సిబ్బందిని అందుబాటులో ఉంచడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం వంటి చర్యలు తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment