జామ్.. జామ్.. | Jam Jam | Sakshi
Sakshi News home page

జామ్.. జామ్..

Published Sun, Jul 19 2015 12:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

జామ్.. జామ్.. - Sakshi

జామ్.. జామ్..

సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తరువాత వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో పుష్కరాల్లో ఐదో రోజైన శనివారం వేల మంది పుష్కర స్నానాలకు తరలి వెళ్లారు. ఉదయం 5 గంటల నుంచి రాజమండ్రి వైపు వెళ్లే మార్గం వాహనాలతో కిక్కిరిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి విజయవాడవైపు వచ్చే మార్గం వాహనాలతో కిటకిటలాడింది. పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ జామైంది. విజయవాడ నుంచి రాజమండ్రికి సాధారణంగా నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ట్రాఫిక్‌జామ్ కారణంగా ప్రయాణానికి 10 గంటలకు పైగా  పడుతోంది. తిరుగు ప్రయాణం ఎక్కువ సమయం పడుతోంది.

 రైలులో 40 వేల మంది ప్రయాణికులు
 శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు విజయవాడ రైల్వే స్టేషన్ మీదగా రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరు, గోదావరి స్టేషన్లకు సుమారు 40 వేల మంది ప్రయాణికులు వెళ్లారని రైల్వే అధికారులు తెలిపారు. రాజమండ్రికి 10 ప్రత్యేక రైళ్లు వేశారు. 20 బోగీలతో వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు 24 బోగీలు తగిలించారు. రాజమండ్రిలో స్టేషన్‌లో ఫ్లాట్‌ఫారాలు ఖాళీగా లేకపోవడంతో తాడేపల్లిగూడెం తరువాత ఏ స్టేషన్ ఖాళీగా ఉంటే అక్కడే ప్రత్యేక రైళ్లను ఆపేస్తున్నారు. తాడేపల్లిగూడెం వరకు రెండు గంటల్లో రైలు చేరుకున్నా.. అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు నాలుగు గంటలు పడుతోంది. జనరల్, రిజర్వేషన్ బోగీలు కిటకిటలాడుతున్నాయి. బోగీల్లో చోటులేక ద్వారం వద్దే వెలాడుతూ ప్రయాణిస్తున్నారు. పుష్కర సమాచారం తెలిపేందుకు విజయవాడలో రెండు విచారణ కేంద్రాలు, ఆరు టికెట్ కౌంటర్లను అదనంగా తెరిచారు.

 బస్సుల్లో 18 వేల మంది ప్రయాణం
 శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై 120 స్పెషల్ బస్సులకు తోడుగా మరో 250 బస్సులను నడిపారు. శనివారం మధ్యాహ్నానానికి ఒక్క విజయవాడ నుంచే 18వేల మంది ప్రయాణికులు రాజమండ్రి, కొవ్వూరు వెళ్లారని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. రాజమండ్రిలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన బస్సు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. రాజమండ్రి వెళ్లిన బస్సులు తిరిగి వస్తే వాటినే తిరిగి ఆదివారం రాజమండ్రికి పంపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. డిపోలోని బస్సులు అన్నింటినీ పుష్కరాలకు పంపినందున అదనంగా బస్సులు నడపడం కష్టమంటున్నారు.

 దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
 దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పుష్కర సాన్నాలకు వెళ్తూనో, లేక తిరుగు ప్రయాణంలోనో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కర్ణాటక, తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారింది. ఒక శనివారమే 70 వేల నుంచి 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా.

 కారు కిరాయి భారం
 సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి రాజమండ్రికి అంబాసిడర్ కారుకు రూ.3 వేలు ఇండికాకు రూ.3,500, టవేరాకు రూ.4,500, ఇన్నోవాకు రూ.5 వేల చొప్పున తీసుకునేవారు. శనివారం అంబాసిడర్‌కు రూ.7వేలు, ఇండికాకు రూ.8వేలు, టవేరా,ఇన్నోవాలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున వసూలు చేశారు. పది నుంచి 15 మంది ప్రయాణించే ట్రావెలర్స్, తుఫాన్ వంటి మినీ బస్సులు, వానులకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ట్రాఫిక్‌జామ్‌లో వాహనాలు చిక్కుకుంటే వెయిటింగ్‌చార్జీ చెల్లించాలంటూ ట్రావెల్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. టోల్‌గేట్లు చార్జీలు కూడా ప్రయాణికులే చెల్లించాలని కొంతమంది వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.

 ఆదివారం మాటేమిటీ..?
 ఆదివారం రోజున పుష్కర ట్రాఫిక్ యథాతథంగా కొనసాగుతుందని అంచనా. అయితే ఇప్పటికిప్పుడు రైళ్లు, బస్సుల        సంఖ్య పెంచడం సాధ్యం కాదని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.ట్రాఫిక్ జామ్ కారణంగా రాజమండ్రి వైపు వెళ్లడానికి  డ్రైవర్లు ముందుకు రావడం లేదని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు.

 కీసర వద్ద బారులు తీరిన కార్లు
 కంచికచర్ల : మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లే కార్లు, ఇతర వాహనాలు శనివారం మండలంలోని కీసరలో స్వర్ణటోల్‌గేట్ వద్ద బారులుదీరాయి. ఈ ఒక్క రోజు టోల్ గేట్ నుంచి 976 కార్లు వెళ్లాయని, రూ.50 వేల ఆదాయం వచ్చిందని టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు.  

 టోల్‌గేట్ జంక్షన్ జామ్
 గన్నవరం : పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనలతో చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి శనివారం కిక్కిరిపోయింది. రామవరప్పాడు నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిం చింది. వాహనాల రద్దీ తెల్లవారుజాము నుంచే మొదలైంది. పొట్టిపాడు టోల్‌గేటు వద్ద ఉదయం మూడు గంటల సమయంలో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఉంగుటూరు పోలీసులు తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. టోల్‌గోటులో వసూలు నిలిపివేసి వాహనాలను వదిలేయడంతో ట్రాఫిక్ అదుపులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement