టీపీసీసీ చీఫ్‌గా జానారెడ్డి?
సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా బొత్సనే కొనసాగించాలని నిర్ణయం!
చిరంజీవికి ప్రచార కమిటీ సారథ్యం!
నేడో, రేపో ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తొలి అధ్యక్షుడిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. సీమాంధ్రకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ పదవికి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, పొన్నాల పేర్లు చివరివరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, సామాజికవర్గమే అడ్డుగా నిలిచినట్లు తెలిసింది. సీమాంధ్రకు కాపు సామాజికవర్గానికి చెందిన బొత్సను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నందున, తెలంగాణకు మరో సామాజిక వర్గానికి అవకాశమివ్వాలన్న నిర్ణయంతో జానారెడ్డికి అవకాశం దక్కినట్లు తెలిసింది. ఇరు ప్రాంతాల పీసీసీ అధ్యక్షుల పేర్లను వెల్లడిస్తూ అధిష్టానం ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పార్టీవర్గాల కథనం ప్రకారం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సుమారు డజను మంది పేర్లను పరిశీలించింది. డీఎస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దళితుడైన దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి సీనియారిటీ, సామాజిక నేపథ్యం, సమన్వయం చేయగల సామర్ధ్యం ఎక్కువ మంది జానారెడ్డి వైపే మొగ్గు చూపడంతో ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీమాంధ్రకు పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు తెలంగాణకు జానారెడ్డి, డీఎస్‌ల పేర్లతో, సీమాంధ్రకు బొత్స, కన్నా, చిరంజీవి పేర్లతో తుది జాబితాను సిద్ధం చేశారు. సోనియా టీపీసీసీ అధ్యక్షుడిగా జానారెడ్డి, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా బొత్సను ఖరారు చేసినట్లు తెలిసింది. చిరంజీవికి సీమాంధ్రలో పార్టీ ప్రచార సారథిగా బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. డీఎస్‌కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. శని లేదా ఆదివారాల్లో తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుల పేర్లతోపాటు ఇతరత్రా కమిటీలను కూడా వెల్లడించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది.
సచ్ఛీలుడికే పార్టీ పగ్గాలివ్వాలి: సచ్ఛీలుడు, సమర్థత కలిగిన నేతకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరతూ పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాయాలని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్ తదితరులు శుక్రవారం సీఎల్పీలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక పీసీసీ ఏర్పాటుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నందున తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ లేఖను సిద్ధం చేశారు. గురువారం తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీలుగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయ పరిచేందుకు ఆమోస్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటుచేశారు.