పొన్నాలకు తెలంగాణ పీసీసీ పదవి!
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తొలి అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పీసీసీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా షబ్బీర్ అలీ, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా శ్రీధర్‌బాబు, మ్యానిఫెస్టో కమిటీ కో ఛైర్మన్‌గా భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సుమారు డజను మంది పేర్లను పరిశీలించింది. డీఎస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దళితుడైన దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి సీనియారిటీ, సామాజిక నేపథ్యం, సమన్వయం చేయగల సామర్ధ్యం నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.