రెండో రోజూ తీరు మారని ‘జన్మభూమి’ గ్రామ సభలు
సంతకవిటిలో నిలిచిన గ్రామసభ
జన్మభూమి కమిటీలు లక్ష్యంగా దుమారం
శ్రీకాకుళం టౌన్: జన్మభూమి-మాఊరు గ్రామ సభలు జిల్లాలో రచ్చ..రచ్చగా మారుతున్నాయి. రెండో రోజైన ఆదివారం కూడా పలు గ్రామాల్లోని సభల్లో వివాదాలు తలెత్తాయి. కొన్ని చోట్ల టీడీపీ వర్గాల మధ్యే ఘర్షణలు తలెత్తాయి. మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న గ్రామసభ సైతం టీడీపీ కార్యకర్తల అరుపులు కేకలతో సాగింది. పాతపట్నం నియోజకవర్గం అంతటా మాజీ మంత్రి శత్రచర్ల, మంత్రి అచ్చెన్న వర్గీయులు రెండుగా విడిపోయి గలాటా సృష్టించారు. జన్మభూమి కమిటీల్లో నియోజక వర్గ ఇన్‌చార్జిగా ఉన్న శత్రుచర్ల వర్గీయులను కాదని అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన కొందరికి పగ్గాలు అప్పగించడంతో తమ్ముళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి.
జన్మభూమి వేదికగా పథకాల పంపిణీలో ఒక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో మిగతా వర్గం వారు అధికారులను నిలదీశారు. కొత్తూ రు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, పాతపట్నం, మెళి యాపుట్టి మండలాల్లోని పలు గ్రామసభల్లో టీడీపీ కార్యకర్తల తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఇతర పథకాల మం జూరులో వివక్షత కొనసాగుతోందంటూ నిరసన వ్యక్తం చేయడంతో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. సంతకవిటి గ్రామసభను అర్థాంతరంగా ముగించిన అధికారులు మరో గ్రామపంచాయతీకి వెళ్లిపోయారు. అక్కడ టీడీపీ సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడు వర్గీయులతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు వర్గీయుల మధ్యతలెత్తిన వివాదం చిలిచిలికి గాలివానగా మారడంతో అధికారులు వారిని సర్థి చెప్పలేక వెనుదిరిగారు.
పాలకొండ మండలం ఎరకరాయపురంలో గ్రామ సభ ఆరంభం కాగానే పింఛన్ల తొలగింపుపై మహిళలు అధికారులను నిలదీశారు. అర్హులైన పేదల పింఛన్లను సైతం తొలగించారంటూ వాగ్వివాదానికి దిగారు. రేషన్ కార్డుల కోసం గత రెండు విడతల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వారికి ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సూచించిన వారికే కార్డులు జారీ చేయడాన్ని వారు తప్పుపట్టారు. జన్మభూమి కమిటీల తీరును నిరసిస్తూ కంచిలి మండలం బూరగాం సర్పంచ్ ఎం.రాములు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోవడంతో జన్మభూమి గ్రామసభ అర్థాంతరంగా వాయిదా పడింది. బూర్జ మండల కేంద్రంలో సరకులు ఇవ్వడం లేదంటూ డీలరుపై స్థానికులు జన్మభూమి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇచ్ఛాపురం పట్టణంలోని డీసీఎంఎస్ దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగులు సరకుల ధరకంటే అదనంగా రూ.4 వసూలు చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సభలో ఉన్న జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ విచారణకు ఆదేశించారు.
సెలవులో కలెక్టర్
జన్మభూమి గ్రామసభలు జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అత్యవసరంగా సెలవుపై వెళ్లారు. ఆయన స్వస్థలంలో సమీప బంధవు మృతివార్త తెలుసుకున్న ఆయన శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టరుగా జేసీ వివేక్‌యాదవ్ వ్యవహరిస్తున్నారు.
‘జన్మభూమి’ పర్యవేక్షణకు అధికారులు
జిల్లాలో జన్మభూమి గ్రామసభల పర్యవేక్షణకు ప్రభుత్వం ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. గతంలో జిల్లాలో పనిచేసిన సీసీఎల్‌ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునీఠాతోపాటు సీనియర్ అధికారి పీవీ సత్యనారాయణలను నియమించింది. అలాగే గతంలో డ్వామా పీడీగా పనిచేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి ఏకేమౌర్యను కూడా పర్యవేక్షకుడిగా నియమితులయ్యారు. ముగ్గురు అధికారులు మూడు డివిజన్లలో జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రభుత్వానికి నివేదికలను అందజేయనున్నారు.
రచ్చ..రచ్చ!
Published Mon, Jan 4 2016 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement