పన్నుల రేట్లు తగ్గే సంస్కరణలు తేవాలి
జయప్రకాష్‌నారాయణ డిమాండ్
సాక్షి, అమరావతి: చలామణీలో ఉన్న పెద్ద నోట్లను తక్షణం రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్య నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడంలో ముందడుగే కానీ, మళ్లీ అవినీతి జరగకుండా చేస్తూ ప్రజలకు సమర్థ పాలన అందించడానికి మాత్రం సరిపోదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ ఒక ప్రకటన ద్వారా అభిప్రాయపడ్డారు.
పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ రాజకీయ గిమ్మిక్కుగా మిగిలిపోకూడదంటే.. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పన్నుల తగ్గింపుతోపాటు ప్రజల పన్నుల డబ్బును నేతల విలాసాలకు, ఉద్యోగుల జీత భత్యాలు భారీ పెంపునకు కాకుండా ప్రజల సేవలకు సద్వినియోగం చేసే సంస్కరణలను చేపట్టాలని సూచించారు. పన్ను రేటు తగ్గింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయాన్ని రూ.10 కోట్లతో వృధాగా అలకరించడం, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం వంటి వాటి కోసమా ప్రజలు పన్నులు చెల్లించేది అని ప్రశ్నించారు.