జయసుధ ఓటమిని ముందే ఊహించారా?
జయసుధ మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు ముందే ఊహించారా ? అందుకే గురువారం కౌంటింగ్ జరుగుతున్న ఫిల్మ్ చాంబర్ వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన ప్రతి రౌండ్లో ఆమె ప్రత్యర్థి రాజేంద్రప్రసాద్ ముందంజలో ఉన్నారు. చివరి రౌండ్ వరకు ఆయన అదే హవా కొనసాగారు. దీంతో జయసుధకు ఓటమి తప్పలేదు. ఆమె తరపున సమీప బంధువు హీరో నరేష్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఆయన అక్కడే ఉన్నారు.
ఎప్పుడు సాదాసీదాగా జరిగే మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికలను తలపించాయి. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ మా ఎన్నికల్లో పోటి చేస్తున్నట్లు ప్రకటించిన కొన్నాళ్ల తర్వాత.. అనూహ్యంగా మురళీమోహన్ వర్గం తమ తరపున జయసుధ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుని... మీడియా సాక్షిగా రోడ్డెక్కారు. అంతలో ఎన్నికలు రానే వచ్చాయి. మార్చి 29వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇంతలో నటుడు, నిర్మాత ఓ.కళ్యాణ్ మా ఎన్నికల తీరును సవాల్ చేస్తూ...సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు.. మా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని ఆదేశించింది. చివరకు ఫలితాల వెల్లడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. 'మా' లో 702 మంది సభ్యులు ఉన్నా కేవలం 394 ఓట్లు పోలయ్యాయి. రాజేంద్రప్రసాద్ 85 ఓట్లు తేడాతో విజయం సాధించారు.