
మా అనుమతి లేకుండా చేరతారా?
మంట పెట్టిన వారికే సెగ తాకితే ఎలా ఉంటుందో జేసీ సోదరులకు తెలిసొచ్చినట్టుంది.
మంట పెట్టిన వారికే సెగ తాకితే ఎలా ఉంటుందో జేసీ సోదరులకు తెలిసొచ్చినట్టుంది. తాము పాటించిన ధర్మాన్నే మరొకరు పాటిస్తే సహించలేకపోతున్నారు. తాము చెప్పింతే నీతి. తాము చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తామే వలస పక్షుల మన్న సంగతి మర్చిపోయి 'దూకుడు' నేతలను అడ్డుకుంటున్నారు. 'మా అనుమతి లేకుండా ఎవరూ పార్టీలో చేరకూడదు' అన్నట్టుగా హుంకరిస్తున్నారు.
అనేక ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పదవులు వెలగబెట్టిన జేసీ సోదరులు ఎన్నికలకు ముందు టీడీపీలోకి దూకారు. కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలి తమ దారి తాము చూసుకున్నారు. ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా వారే విధంగా వ్యవహరించారనేది అందరూ చూశారు. ఎన్నికల పోరు ముగిసిన తర్వాత కూడా వారు అదే పంథాలో ముందుకెళుతున్నారు.
తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వీరంగమాడారు. తాము వలస నేతలమన్న సంగతి మర్చిపోయి 'జంప్ జిలానీ'లను అడ్డుకున్నారు. టీడీపీలో చేరాలనుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూం బాబా ఆశలకు గండికొట్టారు. కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పరా, వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని హెచ్చరించారు.
తమ నాయకుడు వీరంగమాడుతుంటే అనుచరులు చూస్తూ ఊరుకుంటారా. తమకు అలవాటైన విద్య ప్రదర్శించారు. కుర్చీలు విసిరేసి ఫ్లెక్సీలు చించేసి, తమకు తెలీకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ నిష్ర్కమించారు. జేసీ వీరంగంతో టీడీపీలో ముందునుంచి నాయకులు అవాక్కయ్యారు. ఇప్పుడే ఇలావుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ తలలు పట్టుకున్నారు.