
అద్దెలదిరే!
- తిరుపతిలో జీవించేదెలా?
- అద్దెకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు
- నగర పరిసర ప్రాంతాల వైపు పయనం
- ఇళ్ల ముందు అలంకారంగా‘టు లెట్’ బోర్డులు
ఒక వైపు విద్యాలయాలు, మరోవైపు దేవాలయాలు కొలువుదీరిన తిరుపతి నగరానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి చేరుతున్నారు. ఇక్కడి ఆకాశాన్నంటే ఇళ్ల అద్దెలను చూసి ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని జీతాల్లో సగానికిపైగా అద్దెకు చెల్లించలేక నగర శివారు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.
తిరుపతి కార్పొరేషన్: ఐదేళ్ల క్రితంతో పోలిస్తే తిరుపతి నగర రూపురేఖలు మారిపోయాయి. నగర జనాభా పెరగడంతో పాటు పరిసర ప్రాంతాలూ విస్తరించాయి. పిల్లల చదువులకోసమో, వ్యాపారాల నిమిత్తమో తిరుపతి నగరానికి వచ్చి చేరుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దీనిని అవకాశంగా తీసుకున్న యజమానులు ఇళ్ల అద్దెలను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు నగరంలో అద్దెకు దిగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
ఆ ప్రాంతాలు చాలా ఖరీదు...
తిరుపతిలోని కేశవాయనగుంట, బైరాగిపట్టెడ, న్యూ బాలాజీ కాలనీ, బాలాజీ కాలనీ, పెద్దకాపు వీధి, భవానీ నగర్, ఖాదీకాలనీ, వరదరాజనగర్, శ్రీపురం కాలనీ, ఎన్‌జీవో కాలనీ, సుబ్బారెడ్డినగర్, రామచంద్రానగర్ ప్రాంతాల్లో ఇంటి అద్దె లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో డబుల్ బెడ్‌రూమ్ రూ.9 వేల నుంచి రూ.15 వేలు, సింగిల్ బెడ్‌రూమ్ రూ.5వేలు చెబుతున్నారు. అదే సాధారణ
భవనంలో డబుల్ బెడ్‌రూమ్ రూ.6 వేల నుంచి రూ.10 వేలు, సింగిల్ బెడ్‌రూమ్ రూ.3.5 వే ల నుంచి రూ.6వేలు చెబుతున్నారు.
పైగా నీటి సమస్య కారణంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించినందుకు అదనపు ఖర్చు. ఇక సాధారణ, ఇతర స్లమ్ ఏరియాల్లో సైతం సింగిల్ బెడ్‌రూమ్ రూ.3 వేలకు తక్కువగా దొరకడం లేదు. డబుల్ బెడ్‌రూమ్‌కు రూ.7వేలు సమర్పించుకోవాల్సిందే. సామాన్యులు, నిరుపేదలు నివసించే జీవకోనలో సైతం సింగిల్ బెడ్‌రూమ్ రూ.2.5 వేల నుంచి రూ.5వేలు, డబుల్ బెడ్‌రూమ్ రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంది.
అద్దె పెరగడానికి కారణం...
నగరపాలక సంస్థ పరిధిలో 43 వేల గృహాలు, 165 అపార్ట్‌మెంట్లు ఉండగా వీటిలో 78 వేల కుటుంబాలు కాపురం ఉన్నాయని అధికారిక సమాచారం. ఇందులో సగానికి పైగా అనుమతిలేని భవనాలున్నాయి. ఈ భవనాలకు గత ఏడాది 25 శాతం అపరాధ రుసుము ఇంటి పన్నులో కలిపి వసూలు చే శారు. ప్రస్తుతం 2012లో జారీ చేసిన జీవో నెంబరు 168 ప్రకారం వంద శాతం అపరాధ రుసుమును ఇంటి పన్నుతో కలిపి కార్పొరేషన్ వసూలు చేస్తోంది.
ఇది ఒక రకంగా ఇంటి యజమానులకు పెనుభారమే. దీంతో పాటు భవన నిర్మాణ వ్యయం పెరగడం మరో కారణం. ఐదేళ్ల క్రితం ఒక భవన నిర్మాణంలో ఒక చదరపు అడుగుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేసేవారు. ప్రస్తుతం రూ.1500 నుంచి రూ.1800 వరకు ఖర్చు అవుతోంది. అదే అపార్ట్‌మెంటుకు ఒక చదరపు అడుగుకు రూ.1300 నుంచి రూ.1400 ఖర్చు అవుతుండగా, ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంటికి పెట్టిన పెట్టుబడిని తక్కువ సమయంలో రాబట్టుకోవాలనే అత్యాశతో యజమానులు అద్దెను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కమర్షియల్ షాక్...
అద్దె భవనంలో వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్న వారి పరిస్థితి మరీ దారుణం. ఏదైనా వ్యాపారం కోసం అద్దెకు వచ్చే వారు లక్షల్లో అడ్వాన్స్ చెల్లించుకోవాలి. దీంతో పాటు 11 నెలలకోసారి, కార్పొరేషన్ పన్నులు పెంచిందని అద్దెను సైతం రెట్టింపు చేస్తున్నారు. దీనిని ప్రశ్నిస్తే వెంటనే ఖాళీ చేయమంటారు. అయితే అప్పటికే ఇంటీరియల్ డెకరేషన్ కోసం లక్షలు ఖర్చు చేసుకున్న అద్దెదారులు చేసేది లేక యజమానులు చెప్పిన రెట్టింపు అద్దెను ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితి ఎయిర్ బైపాస్ రోడ్డు, ఆర్‌సీ రోడ్డు, నేతాజీ రోడ్డు, గాంధీరోడ్డు, చిన్నబజారు వీధి, తీర్థకట్టవీధి, తిలక్‌రోడ్డు, వీవీ మహాల్ రోడ్డుతో పాటు పలు వాణిజ్య కేంద్రాలున్న ప్రాంతాల్లో నెలకొంది.
కొత్తగా పన్నులు పెంచలేదు
2007 గెజిట్ ప్రకారం నగరంలో ఎక్కడా ఆస్తిపన్ను పెంచలేదు. కొత్తగా చేపట్టిన భవన నిర్మాణాలు, అనుమతులు లేకుండా చేపట్టిన భవన నిర్మాణాలకు మాత్రమే కొత్త పన్నులు వేశాం. యజమానులు ప్రజలను మభ్యపెట్టి ఇంటి అద్దెలు అమాంతం పెంచుతున్నారు. ఇటీవల కార్పొరేషన్‌లో విలీనం అయిన ఆ మూడు పంచాయతీల్లోనూ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతుల్లోనే పన్నులు విధించాం.
-కేఎల్.వర్మ, రెవెన్యూ అధికారి, తిరుపతి, నగర పాలక సంస్థ