‘బెల్ట్’ తీయని ఎక్సైజ్
- బందరు మండలంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు
- దేవాలయాలు, పాఠశాలల సమీపాల్లో విక్రయాలు
- క్వార్టర్‌కు రూ.20 అదనం
- ఎక్సైజ్ మంత్రి ఇలాఖాలో తమ్ముళ్ల ఇష్టారాజ్యం
- మామూళ్ల మత్తులో ఎక్సైజ్ సిబ్బంది
కోనేరుసెంటర్(మచిలీపట్నం) : బందరు మండలంలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే యథేచ్ఛగా మద్యం షాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులే బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని, అందువల్లే ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బందరు మండలంలో 34 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో 104 గ్రామాలు ఉండగా, పది శాతం పల్లెల్లో మినహా అన్ని చోట్లా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో దేవాలయాలు, విద్యా సంస్థల సమీపంలోనే నిర్భయంగా బెల్టు షాపులు కొనసాగిస్తున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులపై దాడులు
మండలంలోని సీతారామపురంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యాన బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో ఓ బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తి తాను చెప్పినట్టే ఎక్సైజ్ సిబ్బంది నడుచుకుంటారని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అతను పగలూ, రాత్రి తేడా లేకుండా బెల్టు షాపును నిర్వహిస్తున్నారు. అతని ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులపై దాడులకు తెగబడుతున్నాడు.
ఈ విషయంపై ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మండలంలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం, పోతేపల్లి, అరిశేపల్లి, హుస్సేన్‌పాలెం, తాళ్లపాలెం, శ్రీనివాసనగర్, మంగినపూడి, బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, రుద్రవరం, కాానూరు, పెదపట్నం, కోన, ఎన్.గొల్లపాలెం, పోతిరెడ్డిపాలెం, నవీన్‌మిట్టల్‌కాలనీ, కరగ్రహారం తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అధికారుల కనుసన్నల్లోనే..!
ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనేగ్రామాల్లో బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బెల్టు షాపులకు అనాథరైజ్డ్ మద్యం సరఫరా
మండలంలో కొనసాగుతున్న బెల్టు షాపులకు బందరులోని పలు వైన్ షాపుల నిర్వాహకులు అనాథరైజ్డ్‌గా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ మద్యాన్ని గుడివాడ, గుడ్లవల్లేరు ప్రాంతాల నుంచి రవాణా తీసుకొస్తున్నారు. బాటిళ్లపై లేబుళ్లను తొలగించి ఎమ్మార్పీ కన్నా రూ.5 ఎక్కువగా బెల్టుషాపులకు విక్రయిస్తున్నారు. ఇటీవల బందరులోని మూడు స్తంభాల సెంటరులో ఉన్న ఓ వైన్ షాపులో ఎక్సైజ్ అధికారులు రూ.5 లక్షల విలువైన అనాథరైజ్డ్ మద్యం స్వాధీనం చేసుకోవడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇప్పటికైనా మంత్రి, ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్‌షాపుల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.