శాంతిభద్రతలంటే ఉలుకెందుకో?
ప్రభుత్వం చర్చ చేపట్టకపోవడంపై వైఎస్సార్ సీపీ ధ్వజం
సర్కారు రాజకీయ హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
శాంతిభద్రతలపై 344 నిబంధన కింద చర్చిద్దామని స్పీకర్ చెప్పారు
రోజుకుపైగా గడువుతో నోటీసిచ్చాం
ఇంకా గడువు కావాలని కోరడంలో ప్రభుత్వం ఆంతర్యం తెలిసిపోతోంది
సభలో బాబు లేకుండా పారిపోయారు
1983 నుంచి చర్చకు సిద్ధం మైనార్టీలంటే టీడీపీకి ఇంత చులకనా?
హైదరాబాద్: ‘‘టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత రెండు నెలల్లోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఊచకోత కోస్తున్నారు. పోలీసులకు కేసులు పెట్టే ధైర్యం కూడా లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం ధ్వజమెత్తింది. సర్కారు చేయిస్తున్న రాజకీయ హత్యలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఆ పార్టీ శాసన సభాపక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జలీల్‌ఖాన్. అత్తార్ చాంద్‌బాషా, సునీల్‌కుమార్ తదితరులు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘‘శాంతిభద్రతలపై 344 నిబంధన కింద నోటీసిస్తే సభలో చర్చిద్దామని స్పీకర్ స్వయంగా చెప్పారు. స్పీకర్ మాటకు గౌరవమిచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజా సమస్యలపై చర్చించాం. అయితే ప్రశ్నోతరాల్లో ఏ అంశంపైనా ప్రభుత్వం సమాధానమిచ్చే పరిస్థితి సభలో కనిపించలేదు. దిగజారిన శాంతిభద్రతలపై చర్చించి చట్టాల్ని కఠినతరం చేస్తారని ఆశిస్తుంటే.. టీడీపీ ప్రభుత్వానికి అంత ఉలుకెందుకో అర్థం కావడంలేదు. శాంతిభద్రతలపై చర్చకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. 24 గంటలకు పైగా గడువుతో 344 నిబంధన కింద నోటీసిచ్చాం. చర్చకు ఇంకా గడువు కావాలని చెప్పడంలో ప్రభుత్వం ఆంతర్యమేమిటో తెలిసిపోతోంది. ప్రభుత్వం ఎంతలా భయపడుతోందో అర్థమవుతుంది’’ అని అన్నారు. సభా నాయకుడు చంద్రబాబు సభలో లేకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయమనే ఆయుధంతో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపునకు దిగడం సరికాదన్నారు.
కొత్త సంప్రదాయాలు చెప్పడం విడ్డూరం: గడికోట
టీడీపీ నేతలు గంటలకొద్దీ మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రి యనమల కొత్త సంప్రదాయాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
రాజకీయ హత్యలు పరుగెడుతున్నాయ్: శ్రీధర్‌రెడ్డి
టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అడుగు ముందుకు పడటంలేదని, రాజకీయ హత్యలు, అక్రమ కేసులు మాత్రం పరుగులెత్తుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ హత్యలపై సూటిగా ప్రశ్నిస్తుంటే జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకోవాలని టీడీపీ నేతలు చెప్పడం చర్చను పక్కదారి పట్టించేందుకేనని చెప్పా రు. రాజకీయ హత్యలపై ఆయన సూటిగా ప్రశ్నలు సంధించారు. ‘‘1983 టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ కీయ హత్యలపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉ న్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా’’ అని అన్నారు.
కొత్త చరిత్ర ఉండాలి.. రక్త చరిత్ర కాదు..
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో కొత్త చరిత్ర ఉండాలి కానీ రక్త చరిత్ర కాదని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సూచించారు. మరో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అవుతారని ఆయనే కలలో కూడా ఊహించుకోలేదని, ఆయన అన్ని పార్టీలని కలుపుకుని పోటీ చేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం సింగిల్ ఫైటరని అన్నారు. మైనార్టీల సమస్యల పట్ల ప్రభుత్వం ఇంత చులకనగా వ్యవహరించడం దారుణమని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం హేయమని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ వ్యాఖ్యానించారు.