రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా కిరణ్ సర్కార్ తయారుచేసిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు.
నెల్లూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా కిరణ్ సర్కార్ తయారుచేసిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ మరణం రాష్ట్రానికి తీరని లోటని ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమాలపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు లోక్‌సభలో ఏమీ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం, చంద్రబాబు నక్కనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
సోనియాగాంధీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్యాకేజీల కోసం బాబు పనిచేస్తున్నారని జూపూడి ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడితే, చంద్రబాబు మాత్రం ఆ కుటుంబాన్ని చీల్చి, అదే తరహాలో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. రాష్ట్రం విడిపోతే నీటి సమస్య, మౌలిక వసతులు, ఆర్థిక సమయ్య, విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆయనన్నారు.