కాంగ్రెస్, బీజేపీ, టీడీపీపై ఎమ్మెల్సీ జూపూడి ధ్వజం
కొండపి, న్యూస్‌లైన్ :
రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై తెలుగుజాతికి ద్రోహం చేశాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. స్థానిక పీఆర్ అతిథి గృహంలో గురువారం ఆయన వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మహానేత వైఎస్‌ఆర్ సెంటిమెంటును తగ్గించేందుకు విభజన అంశాన్ని ఆ మూడు పార్టీలూ తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్నారు. బీజేపీ అగ్రనాయకులతో చంద్రబాబు అనేక రహస్య సమావేశాలు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా జూపూడి గుర్తు చేశారు. రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన తర్వాత చంద్రబాబు ముఖం వెలిగిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు ఐదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్ విందు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చీల్చే కుట్రలో బీజేపీ భాగస్వామ్యం కావడం విచారకరమన్నారు. బీజేపీకి దగ్గరగా జరిగిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జూపూడి డిమాండ్ చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ పది రోజుల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. విభజనను నిస్సిగ్గుగా సమర్థించిన కాంగ్రెస్ దానికి వంత పాడిన బీజేపీ, దానికి పక్కలో ఉన్న టీడీపీలను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇక నుంచి అధికారులు భయపడన వసరంలేదని ధైర్యం చెప్పారు. దేశ పార్లమెంటరీ వ్యవస్థ గురించి సోనియా, రాహుల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చిన జగన్‌పై సోనియా బీజేపీ సాయంతో రాష్ట్ర విభజన చేసి కక్ష తీర్చుకుందన్నారు. రాష్ట్ర విభజనకు వంతపాడిన పార్టీలు ప్రజా కోర్టులో ఓడిపోతారని జూపూడి హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఉపేంద్ర, జిల్లా నాయకులు డాకా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, టంగుటూరు, పొన్నలూరు, సింగరాయకొండ మండలాల కన్వీనర్‌లు రామారావు, వెంకటేశ్వర్లు, చుక్కా కిర ణ్‌కుమార్ బీసీ, ఎస్సీ సెల్ కన్వీనర్‌లు రాజారపు సుబ్బారావు, గర్నిపూడి రమేశ్, విభజన విభాగం నాయకుడు రవికుమార్‌రెడ్డి, అచ్చకాయల శైలజ పాల్గొన్నారు.
ప్రజా కోర్టులో ఆ మూడు పార్టీలకు శిక్ష తప్పదు
Published Fri, Feb 21 2014 4:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM