చర్చా.. రచ్చా..?
♦ నేడు అసెంబ్లీలో విద్యుత్‌పై స్వల్పకాలిక చర్చ
♦ వ్యూహప్రతివ్యూహాల్లో పార్టీలు
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావే శాల్లో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలన్న వ్యూహంతో విపక్షాలు ఉండగా.. వారిని సభ నుంచి బయటకు పంపైనా కార్యకలాపాలు సాగేట్టు చూసుకోవాలని అధికారపక్షం భావిస్తోంది. సోమవారం నుంచి వరుసగా ఆరు రోజుల పాటు సాగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై చర్చ జరగాల్సి ఉంది. విపక్షాలు సభ జరగకుండా అడ్డుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికార పక్షం అంచనా వేస్తోంది.
రుణమాఫీ నిధులను ఒకేసారి చెల్లించాలని విపక్షాలు పట్టుపడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు ఒక్కటిగా ఈ అంశంపై పట్టుదలగా ఉన్నాయి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే దాకా సభను అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేప థ్యంలో సభ సాగుతుందా..? స్తంభిస్తుందా..? అన్న చర్చ సాగుతోంది. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై అధికార పార్టీ తర్జన భర్జన పడుతోంది. సోమవారం విద్యుత్ అంశంపై చర్చ జరగాల్సి ఉంది.
మాఫీపైనే పట్టు: ప్రభుత్వం సమావేశాల తొలి రెండ్రోజులు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి 12 గంటల పాటు రైతుల సమస్యలపై చర్చిం చింది. విపక్షాలు చేసిన కొన్ని డిమాండ్లకు అంగీకరించింది. అయితే రెండోవిడత రుణమాఫీ కింద మిగిలిన 50 శాతం (రూ.8,500 కోట్లు) ఒకేసారి చెల్లించాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. దీంతోపాటు కరువు మండలాల ప్రకటన, పంట ఉత్పత్తులకు బోనస్ పెంపుదల, ప్రైవేటు అప్పుల వసూళ్లపై మారటోరియం వంటి డిమాండ్లనూ తెరపైకి తెస్తున్నాయి.
శాసనసభలో మిగిలిన పక్షాలను కలుపుకోవడంపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసన సభాపక్షం సోమవారం ఉదయం సమావేశం కానుంది. సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో సభ దృష్టిని మళ్లించాలనే వ్యూహంతో సీఎం ఉభయసభల సమావేశం, గవర్నర్‌ను ఆహ్వానించడం వంటి చర్యలకు పూనుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, డీకే అరుణ వాదిస్తున్నారు. ‘జలదృశ్యం అంటూ మోసపు మాటలతో సభ ముందుకొస్తే కేసీఆర్‌కు అసలు సినిమా ఏంటో మేం చూపిస్తాం’ అని మరో సీనియర్ ఎమ్మెల్యే హెచ్చరించారు.
ప్రభుత్వ శ్రమను చెప్పుకుందాం
తాము పగ్గాలు చేపట్టాక విద్యుత్ సంక్షేభానికి ఎలా చెక్ పెట్టామో రాష్ట్ర ప్రజలకు వివరించాలని అధికార పక్షం భావిస్తోంది. రైతుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగా శ్రమించిందో తెలిపేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్న అంశాన్ని వివరించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా సిద్ధమైనట్లు చెబుతున్నారు.
కొత్త విద్యుత్ ప్రాజెక్టుల సాధన, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు తదితర అంశాలను సవివరంగా ప్రజలకు తెలియజేయాలని అధికార పక్షం భావిస్తోంది. ప్రతిపక్షాలు సహకరించకుంటే.. సస్పెండ్ చేసి కొనసాగించే వీలున్నా, అది సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకటికి రెండుసార్లు వాయిదా వేసుకుని, విపక్ష నేతలను సముదాయించి సభను జరిపే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. కాగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే దిశలో కాంగ్రెస్, టీడీపీల్లో చర్చ జరుగుతోందని, కానీ అందుకు బీజేపీ ఇంకా అంగీకరించలేదని అంటున్నారు.