
సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ హైకోర్టుకు నివేదించారు. తననే లక్ష్యంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసిందన్న నిమ్మగడ్డ ఆరోపణల్లో వాస్తవంలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ఏ చట్టం చేసినా అది కమిషనర్‌కే వర్తిస్తుందని, అలాంటప్పుడు దానిని ఓ వ్యక్తి లక్ష్యంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌గా చెప్పడానికి వీల్లేదన్నారు. గవర్నర్‌కు దురుద్దేశాలు అంటగట్టడం, ఆయన వివేచనను ప్రశ్నించడం వంటివి చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యాజ్యం దాఖలు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆయన కౌంటర్‌లోని ముఖ్యాంశాలు..
► బాధిత వ్యక్తిగా నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి, ఇదే అంశంపై మిగిలిన వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్ పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదు. ఇటువంటి వ్యాజ్యాలపై సాధారణంగా హైకోర్టు విచారణ చేపట్టదు.
► ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాల పరిమితిని సవరిస్తూ ఏప్రిల్ 10న ప్రభుత్వం జారీచేసిన జీఓ 617 వల్ల ఎన్నికల కమిషనర్‌గా సర్వీసు నిలిచిపోయిందని నిమ్మగడ్డ రమేశ్ చెబుతున్నారు. వాస్తవానికి ఇది తప్పు.
► ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లోని క్లాజ్ 5 ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వ్యక్తి సర్వీసు నిలిచిపోతుంది. అంతే తప్ప జీఓ 617 వల్ల కాదు.
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చేసే ఏ చట్టమైనా ఎన్నికల కమిషనర్‌ను ఉద్దేశించే చేయబడుతుంది. కాబట్టి ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకునే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందన్న నిమ్మగడ్డ వాదన అర్థరహితం.
► అలాగే, గవర్నర్‌కు దురుద్దేశాలు అంటగట్టడానికి వీల్లేదు. ఆయన వివేచనను కూడా ప్రశ్నించజాలరు.
ఆ పిటిషన్ మొత్తం కాపీ పేస్టే..
ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డకు మద్దతుగా మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌లోని 13 పేరాలను కామినేని యథాతథంగా తన పిటిషన్‌లో వాడారు. నిమ్మగడ్డ ఏప్రిల్ 11న కామినేని ఏప్రిల్ 12న పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బట్టి నిమ్మగడ్డ రమేశ్ తన పిటిషన్‌ను కామినేని శ్రీనివాస్‌కు పంపారని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక.. కామినేని తన వృత్తిని మెడికల్ ప్రాక్టీషనర్‌గా, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే.
ఫిర్యాదులు పరిశీలించి విచారణ జరపాలి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 54,594 నామినేషన్లు వచ్చాయి. ఈ స్థానాల విషయంలో వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.078 శాతం మాత్రమే. అలాగే, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 15,185 నామినేషన్లు వచ్చాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.092 శాతం మాత్రమేనని జస్టిస్ వి.కనగరాజ్ తన కౌంటర్‌లో ప్రస్తావించారు. అంతేకాక..
► ఫిర్యాదులన్నింటినీ కలిపి చూడకుండా, ఆ ఫిర్యాదులు ఏమిటో పరిశీలించి, వాటిపై విచారణ జరిపితేనే వాటిలో ఎంత వాస్తవం ఉందో తెలుస్తుంది.
► మార్చి 15కు ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు, సలహాలు జారీచేయలేదు. అయినప్పటికీ అదేరోజు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
► దీనిని బట్టి ఎన్నికల కమిషనర్‌గా ఆయన ఎటువంటి సంప్రదింపుల ప్రక్రియను చేపట్టలేదని అర్థమవుతోంది. కాబట్టి ఆయన నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం.
► ఎన్నికల కమిషనర్‌గా తొలగించేందుకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని నిమ్మగడ్డ చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవంలేదు. ఎన్నికల సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, న్యాయంగా జరపడమే ఈ ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశం.
► ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం నేను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయంలో నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతున్నా.
► వాస్తవానికి ఏ చట్టాన్నైనా తెచ్చే శాసనపరమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీనిని ఎవ్వరూ తప్పుపట్టజాలరు. ఈ విషయంలో పిటిషనర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
► నిమ్మగడ్డ రమేశ్‌నే ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు లేదా ఇతర ఏ కోర్టు కూడా ఎక్కడా చెప్పలేదు.
► ఇక వడ్డే శోభనాద్రీశ్వరరావు, గండూరు మహేశ్‌లు తమ వ్యాజ్యాల్లో నిమ్మగడ్డ రమేశ్ తనకు రక్షణ కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారంటూ ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నోట్ ఫైళ్లు లేవు.
ఎవరినీ సంప్రదించక్కర్లేదు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే విషయంలో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరంలేదని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల సంఘం కార్యదర్శితో కూడా మాట్లాడాల్సిన అవసరంలేదని తన రిప్లై కౌంటర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యమైనదని తెలిపారు. తన పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వాధికారులతో సంప్రదించలేదని చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్‌రెడ్డిలు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు నిమ్మగడ్డ తిరుగు సమాధానాలు (రిప్లై కౌంటర్) ఇచ్చారు.