కడప పెద్ద దర్గా ఉరుసు ప్రారంభం
కడప కల్చరల్: దేశంలోని ప్రముఖ దర్గాల్లో ఒకటైన కడప పెద్ద దర్గా(అమీన్‌పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంతో పాటు సమీప ప్రాంతాలు కిటకిటలాడాయి. ముందుగా దర్గా ఆవరణలో మలంగ్‌షాను మేళతాళాలతో పీఠం వద్దకు తీసుకొచ్చి దీక్ష వహింపజేశారు. అర్ధరాత్రి దర్గా గురువులు ఊరేగింపుగా గంధం కలశాన్ని తీసుకొచ్చి ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించనున్నారు.
పీఠాధిపతి ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. జిల్లా జడ్జి రాఘవరావు, డీఈవో ప్రతాప్‌రెడ్డి దర్గా గురువుల మజార్లను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్.. దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబసభ్యులతో కలసి సోమవారం అర్ధరాత్రి దర్గాకు రానున్నారు.