Kadapa dargah
-
త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నా: మంచు మనోజ్
ఒక్కడు మిగిలాడు (2017) సినిమా తర్వాత మంచు మనోజ్ వెండితెరపై కనిపించనేలేదు. అహం బ్రహ్మాస్మి అంటూ ఆ మధ్య పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో అతడి అభిమానులు.. అన్నా అసలు సినిమాల గురించి ఆలోచిస్తున్నావా? లేదంటే పక్కన పెట్టేశావా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అనుమానాలకు ముగింపు పలికాడు మనోజ్. త్వరలోనే తన రీఎంట్రీ ఉంటుందని ప్రకటించాడు. కడప పెద్ద దర్గాను శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడీ హీరో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటినుంచో దర్గాకు రావాలనుకుంటున్నానని, చివరికి ఇప్పటికి కల నెరవేరిందన్నాడు. త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇందుకోసం మరోసారి కుటుంబంతో వచ్చి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకుంటానన్నాడు. చదవండి: కాంతాలగా.. నటి బర్త్‌డే.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన భర్త రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని చెప్పాం -
భక్తిశ్రద్ధలతో కడప పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్: దేశంలో ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన వైఎస్సార్ జిల్లా కడప అమీన్‌పీర్ దర్గాలోని హజరత్ సూఫీ సరమస్త్‌సాని చల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఆదివారం రెండోరోజు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పర్యవేక్షణలో ఆయన సంప్రదాయబద్ధంగా ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాలు, నాత్ గీతాలాపనల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చాదర్‌ను తీసుకెళ్లారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో గురువుల మజార్ వద్ద గంధంతోపాటు చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు, నగర ప్రముఖులు, దర్గా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘దర్గా ఉర్సు ఉత్సవాలకు సహకారమందిస్తాం’
సాక్షి, కడప: జిల్లాలో జరగబోయే దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్‌లతో సమావేశమయ్యారు. జనవరి 8 నుంచి 15వరకు జరిగే దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ దర్గా ఉర్సు ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో దర్గా పీఠాధిపతితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కడప దర్గాలో ఉపముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనలు
సాక్షి, కడప : కడప పెద్ద దర్గాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా కడపకు వచ్చిన అంజాద్ బాషాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి కడప నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గాలోని మాజర్ల వద్ద చదర్లను ఉంచి మంత్రి అంజాద్ బాషా ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు అమరావతిలోని సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
కడప పెద్దదర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని పెద్దదర్గాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పులివెందుల నుంచి సాయంత్రం 6 గంటలకు పెద్దదర్గాకు చేరుకున్న ఆయనకు కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్బీ అంజద్‌బాషా, దర్గా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. దర్గా సాంప్రదాయాన్ని పాటిస్తూ జగన్‌కు తలపాగా చుట్టి సత్కరించారు. అనంతరం జగన్ పెద్దదర్గాలోని హజరత్ పీరుల్లామాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుని చాదర్‌ను సమర్పించారు. దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని, కొద్దిసేపు ధ్యానం చేశారు. ఆ తర్వాత పెద్దదర్గా ఆవరణలో అంజద్‌బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కలిసి పాల్గొన్నారు. జగన్ మాట్లాడుతూ.. అల్లా కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. -
కడప పెద్ద దర్గా ఉరుసు ప్రారంభం
కడప కల్చరల్: దేశంలోని ప్రముఖ దర్గాల్లో ఒకటైన కడప పెద్ద దర్గా(అమీన్‌పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంతో పాటు సమీప ప్రాంతాలు కిటకిటలాడాయి. ముందుగా దర్గా ఆవరణలో మలంగ్‌షాను మేళతాళాలతో పీఠం వద్దకు తీసుకొచ్చి దీక్ష వహింపజేశారు. అర్ధరాత్రి దర్గా గురువులు ఊరేగింపుగా గంధం కలశాన్ని తీసుకొచ్చి ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించనున్నారు. పీఠాధిపతి ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. జిల్లా జడ్జి రాఘవరావు, డీఈవో ప్రతాప్‌రెడ్డి దర్గా గురువుల మజార్లను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్.. దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబసభ్యులతో కలసి సోమవారం అర్ధరాత్రి దర్గాకు రానున్నారు.