‘కాకా’ స్మారకచిహ్నం నెలకొల్పాలి
- కాంగ్రెస్ నేతల డిమాండ్
- గాంధీభవన్‌లో వెంకటస్వామి సంస్మరణ సభ
- కాకలు తీరిన వారికే ‘కాకా’ అని కొనియాడిన నేతలు
సాక్షి, హైదరాబాద్: కాకలు తీరిన రాజకీయ నేతలకూ ‘కాకా’గా కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొనియాడారు. దివంగత నాయకుడు వెంకటస్వామి పేరుతో స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన వెంకటస్వామి సంస్మరణ సభ జరిగింది.
ఈ సభలో పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావు, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పార్టీ అగ్రనేతలు జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, నంది ఎల్లయ్య, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, మల్లు భట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్, మాదు సత్యం, కత్తి వెంకటస్వామి, మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకటస్వామి అసామాన్య స్థాయికి ఎదిగిన దళితజాతి రత్నంగా వారు అభివర్ణించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలని, కాకా పేరుతో ఆడిటోరియం నిర్మించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా ఏర్పడబోయే వాటిలో ఓ జిల్లా కు కాకా పేరు పెట్టాలని కోరారు.
త్రివేణి సంగమంలో అస్థికలు నిమజ్జనం
కాటారం: జి.వెంకటస్వామి అస్థికలను శనివారం ఆయన కుమారులు కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. కాకా కుమారులు మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్‌లు కుటుంబ సభ్యులతో ఉదయం కాళేశ్వరం వచ్చారు. గోదావరి వద్ద ప్రత్యేక పూజలు చేసి, మూడు నదులు కలిసే చోట అస్థికలను నిమజ్జనం చేశారు.