ఎర్రజెండా ముద్దుబిడ్డ ‘వర్ధెల్లి’
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం, ప్రజలకోసం ఉద్యమించిన గొప్ప నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు.. అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఉమ్మడి నల్లగొండ జిల్లా గర్వించదగ్గ ఎర్రజెండా ముద్దుబిడ్డగా నిలిచారని వక్తలు కొనియాడారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములు సంస్మరణ సభను బుధవారం సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు, సీపీఎం కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
సూర్యాపేట : ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన తాను నమ్మిన సిద్ధాంతం, ప్రజల కోసం ఉద్యమించి నల్లగొండ జిల్లా గర్వించదగ్గ ఎర్రజెండా ముద్దుబిడ్డగా వర్ధెల్లి బుచ్చిరాములు నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. భూస్వాములు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తనతోపాటు ఉద్యమించిన కార్యకర్తల కష్టాలను గురించి రాళ్లెత్తిన కూలీలుగా పుస్తకాన్ని రచించిన గొప్ప నాయకుడని.. ఆ మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకుని యువత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సంస్మరణ సభను సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు వివిధ సంఘాలు, పార్టీల నాయకులు, సీపీఎం కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బుచ్చిరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ 1969 డిసెంబర్లో సూర్యాపేటలో జరిగిన యువజన మహాసభలకు బుచ్చిరాములు నాయకత్వం వహించారని, నాటినుంచే బుచ్చిరాములుతో తన అనుబంధం కొనసాగిందన్నారు. వర్ధమానుకోటలో 10రోజులు క్యాంపులో కలిసే ఉన్నామని, పోలీసులు దాడి చేస్తున్నారని తెలిసి మకాంను కొత్తగూడెం మార్చామని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతం అజయమైందన్నారు.
సామాజిక న్యాయం కోసం ఆరాటపడ్డారన్నారు. పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆయన నడిపిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా గర్వించదగ్గ కమ్యూనిస్టు నేత బుచ్చిరాములు అన్నారు. పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం సుదీర్ఘ పోరాటాలు చేసిన యోధుడు బుచ్చిరాములు అన్నా రు. ఆ మహానీయుడికి నివాళులర్పించే అవకాశం రావడం గర్వకారణమన్నారు. అంధోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్ మాట్లాడుతూ నేటి తరానికి బుచ్చిరాములు ఆదర్శమన్నారు. తనతో పాటు పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని గురించి పుస్తకాన్ని రచించిన గొప్ప నాయకుడన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పోరాట యోధులకు నిలయమన్నారు. బుచ్చిరాములు చూపిన మార్గం ఎందరికో ఆదర్శమన్నారు. ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న మాట్లాడుతూ బుచ్చి రాములు లాంటి పోరాటయోధులు ఉన్నంత కాలం కవులు, కళాకారులు ఉం టా రన్నారు. వారి పోరాటాలు, ఉద్యమాలను చూసే మాలో స్ఫూర్తి రగులుతుందన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి.. తినడానికి తిండి లేని సమయంలోనూ పార్టీని వీడకుండా జెండా ను భుజాలపై మోశారని గుర్తు చేశారు.
బీసీ కమిషన్ సభ్యుడు జూ లూరి గౌరీశంకర్ మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బుచ్చిరాములు అని కొనియాడారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, వైఎస్సాఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య.
బీసీసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌లతోపాటు సాక్షి నెట్వర్క్ ఇన్చార్జి శ్రీకాంత్, మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, సీఎం పీఆర్ఓ రమేశ్, ప్రొఫెసర్ రమణనాయక్, బొమ్మగాని ప్రభాకర్, కేవీఎల్ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో ములకలపల్లి రాములు, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, నాయకులు పెద్దిరెడ్డి రాజా, డేవిడ్‌కుమార్, జుట్టుకొండ సత్యనారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, జనార్దన్, గోవింద్ పాల్గొన్నారు.