కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాల కొనసాగింపులో భాగంగా ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2కే రన్‌తో ఉత్సవాలు ప్రారంభించామని చెప్పారు. మూడు రోజులపాటు గణపురం కోటగుళ్లలో 300 మంది కళాకారులతో 30 బృందాలుగా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయని వివరించారు. 27న హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌లో కాకతీయుల చరిత్ర,సంస్కృతిని ప్రంచస్థాయికి తెలిపే విధంగా జాతీయస్థాయిలో సెమినార్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సెమినార్‌కు కాకతీయుల చరిత్రపై పరిశోధనలు చేసిన వారందరినీ ఆహ్వానిస్తామన్నారు. కాకతీయుల ఇరిగేషన్ టెక్నాలజీని చాటిచెప్పేలా ఆ కాలంనాటి గొలుసు చెరువులు, కట్టడాలపై ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. ఎన్‌ఐటీ హైడ్రాలజీ విభాగం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో కాకతీయ చరిత్రకు సంబంధించిన సావనీర్‌ను విడుదల చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇన్‌టాక్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో నిధుల కొరత ఉన్న విషయం వాస్తమేనని... ప్రస్తుతం కొంత మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నిధులు విడుదల జేయూలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గత ఉత్సవాల సందర్భంగా కళాకారులకు బకాయిపడ్డ మొత్తం చెల్లింపుల కోసం ప్రస్తుతం రూ. 30 లక్షలు వచ్చాయన్నారు. సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వేయిస్తంభాల దేవాలయం పనులు వచ్చే ఏడాది జూన్ నాటిని పూర్తవుతాయన్నారు. జిల్లాలో దేవాలయాల పురుద్ధరణకు రూ. 20 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు.
షెడ్యూల్ ఇదే... 24వ తేదీ...
-సాయిబాబా గుడినుంచి కోటగుళ్ల వరకు కళాకారుల ర్యాలీ
-వరంగల్లు జయాపసేని పేరిణి నృత్యాలయం వారి పేరిణి నృత్యం
-చుక్కసత్తయ్య బృందం శివసత్తుల ప్రదర్శన
-రాజేష్‌ఖన్నా బృందం కాకతీయ
-కళాతోరణం నృత్యరూపకం
-వెంకట్రాం నాయక్ జానపద నృత్యం
-కన్నా సాంబయ్య బుర్రకథ
25వ తేదీన...
-వెంపటి నాగేశ్వరి బృందం కూచిపూడి నృత్యం
-ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయగిరిజన నృత్యం
-శ్రీలలితా సంగీత నృత్య పాఠశాల భక్తపోతన శాస్త్రీయ నృత్యరూపకం
-గడ్డం సారయ్య బృందం చిందుయక్ష గానం
-స్వర్ణభారతి గణపురం వారి నృత్యప్రదర్శనలు
-జిల్లా జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జానపద కార్యక్రమాలు
26వ తేదీన...
-సుధీర్‌రావు శ్రీ శివానంద నృత్యమాల బృందం శాస్త్రీయ నృత్యాలు
-అంజయ్య బృందం ఒగ్గుకథ
-ఆజ్మీరా గోవింద్‌నాయక్ బృందం బంజారా నృత్యం
-రహీమొద్దీన్ బృందం జానపద నృత్యం
-పోరిక శ్యాం బృందం ధీంసా కోయ నృత్యం
-గణపురం శ్రీసాయి జానపద కోలాట బృందం ప్రదర్శన
-ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నృత్యం
-మార్తరవి ఇంద్రజాల ప్రదర్శన
-నారగోని విశ్వనాథ బృందం బుర్రకథ ప్రదర్శన
రేపటి నుంచే కాకతీయం
Published Mon, Sep 23 2013 4:36 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement