- ఏటా విపత్తుల బెడద
- విత్తనాలు దక్కని వైనం
చింతపల్లి: మన్యం సిరుల పంట రాజ్‌మా రాను రాను కనుమరుగవుతోంది. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తుల కారణంగా ఈ పంట దెబ్బతింటూనే ఉంది. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ఉందనుకున్న దశలో హుద్‌హుద్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. విత్తనాలు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రానున్న కాలంలో ఈ పంట కనుమరుగైపోతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏజెన్సీలో కాఫీ తరువాత గిరిజన రైతులు రాజ్‌మా పిక్కలనే ప్రధాన వాణిజ్యపంటగా సాగు చేస్తున్నారు.
గతంలో ఒక్క చింతపల్లి, జీకేవీధి మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేవారు. ప్రతి ఏటా దాదాపు రూ.30 కోట్లు వ్యాపారం జరిగేది. మన్యంలో పండిన రాజ్‌మాను ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, పూణే, కోల్‌కత వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. మంచి పోషక విలువలు కలిగిన రాజ్‌మా చిక్కుళ్లకు ప్రతి ఏటా ధరలు పెరుగుతునే వచ్చాయి. గతేడాది కిలో రూ.45తో ప్రారంభమైన రాజ్‌మా రూ.60 వరకు ధర పలికింది.
నాలుగేళ్లుగా నీలం, జల్, లైలా, హుదూద్ తుఫాన్‌లతో రాజ్‌మా పంట 90 శాతం నాశనమైంది. ఐటీడీఏ ద్వారా విత్తనాల పంపిణీ గగనమైపోయింది. కొద్దో, గొప్పో చేతికి అందిన పంటను రైతులు విత్తనాల కోసం నిల్వ చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది కూడా పంటలు దెబ్బతినడంతో రైతులు రాజ్‌మాను వదిలేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించినా ఆశ్ఛర్య పోవలసిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం వర్షాలపై ఆధారపడి పండించే రాజ్‌మా అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. కాఫీతోటలు కూడా తుఫాన్ కారణంగా దెబ్బతినడంతో ప్రధాన వాణిజ్య పంటలు సాగు అనుమానాస్పదంగా మారింది.
విత్తనాలు దక్కలేదు
నాలుగేళ్లుగా ఎకరా భూమిలో రాజ్‌మా సాగు చేపడుతున్నాను. గతంలో 6 బస్తాలు దిగుబడి వచ్చేది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా విత్తనాలు దక్కడం లేదు. వచ్చే ఏడాది ఈ పంటను చేపట్టకూడదని నిర్ణయించుకున్నాను.
-కొర్రా రామ్మూర్తి, బలపం.
అప్పులపాలైపోతున్నాం
రాజ్‌మా పంటపై ఆశలు పెట్టుకొని వ్యాపారుల ద గ్గర అప్పులు చేస్తున్నాం. తీరా పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో నష్టపోతున్నాం. పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి.
-వంతల సీతమ్మ, వంచుల