సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుని ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్దం కావడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు మానసికవ్యాధితో బాధ పడుతున్నారని, ఇటువంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా అని నిప్పులు చెరిగారు. హైకోర్టు ఏపీకి ఇస్తే, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చడానికే అని బాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏవిధంగా వైఎస్ జగన్‌కు మేలు జరుగుతుందో చంద్రబాబే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడారు. 'నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు శ్వేత పత్రం అంటే అర్దం తెలుసా? ఎన్ని నిధులు తెచ్చారు. ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేశారో వివరిస్తే చంద్రబాబు నిజాయితీ అర్థమయ్యేది. కానీ అబద్దాలు, అసత్యాలతో ప్రజలను శ్వేత పత్రాల రూపంలో మభ్య పెడుతున్నారు. అబద్దాల చక్రవర్తిగా పేరు పొందిన బాబు తన పేరును మరోసారి సార్దకం చేసుకున్నారు. మీ ఎంపీ మురళీమోహన్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటు నుంచి శాఖలవారీగా ఏ ఏడాదిలో ఎన్ని నిధులు ఇచ్చామో వివరాలతో సహా ఆందచేశాం.
వివిధ శాఖల నుంచి 14 వేల 319 కోట్లు వచ్చినా .. వాటి గురించి ఏపీ ప్రభుత్వం చెప్పకుండా సాయం చేయడం లేదని ఆరోపించడం అన్యాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలోనే అనేక ఇనిస్టిట్యూట్ లను కేంద్రం ఏపీకి ఇచ్చింది. అనుభవం కలిగిన సీఎంగా చంద్రబాబుకు ప్రజలు పట్టం కడితే.. అన్ని రూపాలలో అవినీతితో డబ్బును దోచుకునేందుకే తన అనుభవాన్ని చూపించారు. బాబు ప్రతి చర్య, ప్రతి మాట అంతా మోసమే. కడప స్టీల్ ఫ్లాంట్ విషయంలోను వాస్తవాలు చెప్పకుండా కేంద్రంపై బురద జల్లుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఐరన్ ఓర్ ఇవ్వకుండా రాయలసీమ వాసులను మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుకు సిద్దమంటూ చంద్రబాబు ఉత్తరం ఇచ్చిన తర్వాతే కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన జ్యూడిషరీ వ్యవస్థను సీఎం క్యాంప్ కార్యాలయంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యల ద్వారా ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రపతి ఆదేశాలను పట్టించుకోకుండా బరి తెగించి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా బాబు పాలన సాగిస్తున్నారు.
కృష్ణా నది ఒడ్డున కట్టడాలు ఉండకూడదంటే.. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్రమార్కుల పక్షాన నిలిచిన చరిత్ర చంద్రబాబుది. రోజుకో మాట మాట్లాడుతూ యూ టర్న్‌లు తీసుకునే చంద్రబాబు ఇప్పుడు హైకోర్టు విషయంలో కూడా యూ టర్న్ తీసుకుని తన బుద్దిని చాటుకున్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లకు ఫిర్యాదు చేస్తాం. ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు, ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో చంద్రబాబు శ్వేత పత్రం విడుదలచేయాలి. ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రానికి రానీయకుండా అడ్డుకుంటామని చంద్రబాబు ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్దం. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి' అని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment