కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో గురువారం కాపు నేతలపై పోలీసులు నిఘా ...
కాపు నేతలపై పోలీసు నిఘా
ముద్రగడ అరెస్టుతో కాపుల్లో కలవరం
విజయవాడ : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో గురువారం కాపు నేతలపై పోలీసులు నిఘా పెంచారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లాలో ఉన్న ముఖ్య నేతల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కిర్లంపూడిలో ముద్రగడ అరెస్ట్, తుని ఘటనలో కొందరిని అరెస్ట్ చేయడంతో మళ్లీ కాపుల్లో కలవరం రేగుతోంది. ఈక్రమంలో ముద్రగడకు సంఘీభావంగా కాపునేతలు కార్యక్రమాలు నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాపు నేతల కార్యక్రమాలపై ఆరా తీస్తున్నారు. కాపునేతలు, సంఘాల నాయకుల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా కృష్ణలంక, గాంధీనగర్, బీసెంట్ రోడ్డు, భవానీపురం తదితర కాపు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు.
అలాగే ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలలో కీలక నేతలుగా ఉన్న కాపు నేతలు, వారి అనుచరగణంపైనా నిఘా ఉంచారు. విజయవాడ రాజధాని నగరం కావడంతో నగరంలో సీఎం క్యాంపు కార్యాలయం ఉండడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని పరిస్థితిపై పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అధికారులతో చర్చించారు. మరోవైపు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలు ప్రభుత్వ చర్యలను సమర్థించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో వారి కార్యాలయాల వద్ద ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతోంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల వద్ద నిరంతర నిఘా కొనసాగుతోంది. అలాగే జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్‌జంక్షన్, గన్నవరం, జగ్గయ్యపేట ప్రాంతాలలో కూడా కాపు నేతల కదలికలపై నిఘా ఉంచినట్లు సమాచారం.