
జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు రైతుల సమస్యలు వివరిస్తున్న కరణం ధర్మశ్రీ
విశాఖపట్నం, చోడవరం : చెరకు రైతులను మోసపూరిత ప్రకటనలతో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీ పర్సన్‌ఇన్‌చార్జి అయిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, మొలాసిస్, ఫ్యాక్టరీలో ఇతర అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్టు ధర్మశ్రీ చెప్పారు. చోడవరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చెరకు రైతులకు గతేడాదికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు రూ.200తో పాటు గ్రాంట్‌గా టన్నుకు రూ.300 తెచ్చి ఇస్తానని ఎమ్మెల్యే చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు. ఈనెల 5వతేదీనే పాతబకాయి టన్నుకు రూ.200 చెల్లిస్తామని ప్రకటన చేసిన ఎమ్మెల్యే ఇచ్చిన గడువు దాటిపోయినా రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమకాలేదని ధర్మశ్రీ అన్నారు.
ఈ ఏడాది క్రషింగ్‌కు ముందే బకాయిలు ఇస్తామని చెప్పారని, అది రైతులు నమ్మి ఇప్పుడు చెరకు సరఫరా చేస్తున్నారని, అయినా ఇచ్చిన గడువు దాటిపోయినా డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో పెట్టుబడులకు మరింత అప్పులు తెచ్చి రైతులంతా అప్పులపాలవుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి పైసా కూడా గ్రాంటు తేలేని ఎమ్మెల్యే రైతులను మోసం చేసే ప్రకటనలు చేయడం మానుకుంటే మంచిదన్నారు. మొలాసిస్ అక్రమ నిల్వలను లెక్కల్లో చూపించకుండా అక్రమంగా అమ్మేయాలని చూశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించడం జరిగిందన్నారు. ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాల్సిన టన్నుకు రూ.200 చొప్పున త్వరలోనే చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారని ధర్మశ్రీ చెప్పారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పల్లా నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు పుల్లేటి వెంకట్రావు, పీఎసీఎస్ అధ్యక్షుడు శానాపతి సత్యారావు, పార్టీ నాయకులు దండుపాటి సన్యాసిరావు, చవితిన బాబూరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment