
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : నిస్వార్థ రాజకీయాలకు ఆయనో ఐకాన్. రాజకీయాల్లో ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేశారు. ఆ తర్వాత ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఆయనే పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన కాటంరెడ్డి రామారావు. ఒకప్పుడు పోడూరు మండలం జిన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. సొసైటీ పరిధిలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడులు అందించి వారి అభివృద్ధికి కృషి చేశారు. నేడు పాలకొల్లులో దిగమర్రు కాలువ గట్టున సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. 1938లో కాటంరెడ్డి రామారావు ఉల్లంపర్రులో జన్మించారు. 1952లో కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై పార్టీ కార్యకర్తగా చేరారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో 1989లో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అప్పట్లో జరిగిన జిన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందిన కొప్పర్తి సూర్యం సొసైటీ అధ్యక్షుడు ఎన్నికకాబడిన సమయంలో కాటంరెడ్డి రామారావును ఉపాధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. ఆ విధంగా మూడు సార్లు సొసైటీ ఉపాధ్యక్షుడిగా, 1985–86లో జిన్నూరు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రైతులకు సేవలందించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో పనిచేస్తున్నారు. రామారావుకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహాలు చేశారు. ప్రస్తుతం సైకిల్ మెకానిక్‌గా కుటుంబ భారాన్ని మోస్తున్నారు.
రాజకీయాల్లో ఎకరం పొలం అమ్ముకున్నా
నా 67 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల సమస్యలపై పోరాటమే తప్ప ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని నా స్వార్థం కోసం వినియోగించుకోలేదు. రాజకీయాల్లో తిరిగి ఎకరం పొలం అమ్ముకున్నా. జిన్నూరు సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసి రైతులకు ఉపయోగపడ్డాననే సంతృప్తి కలిగింది. ఉల్లంపర్రులో పేదలకు 40 మందికి ఆ రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించాను. ఏ వ్యక్తైనా ఎదుట వారికి ఉపయోగపడాలి. వృద్ధాప్యంలో కుటుంబ పోషణ కోసం సైకిల్ మెకానిక్‌గా పని చేస్తున్నా.
–కాటంరెడ్డి రామారావు, ఉల్లంపర్రు
Comments
Please login to add a commentAdd a comment